నిర్భయంగా ఓటేయండి
ఏకగ్రీవం పేరుతో పదవులను అమ్మొద్దు
● ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు
● జిల్లాలో 102 సమస్యాత్మక గ్రామాలు
● 600 మంది పోలీసులతో బందోబస్తు
● మద్యం, నగదు, సామగ్రి పంపిణీపై నిఘా
● ‘సాక్షి’తో ఎస్పీ టి.శ్రీనివాసరావు
గద్వాల క్రైం: ‘‘జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేశాం. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మూడు విడతలుగా నిర్వహించే ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లాలో 600 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాం. అల్లర్లు సృష్టించే వారిని గుర్తించి బైండోవర్ చేస్తున్నాం. మద్యం, నగదు, వస్తుసామగ్రితో ఓటర్లను మభ్యపెడితే కేసులు నమోదు చేస్తాం.’’ అని ఎస్పీ టి.శ్రీనివాసరావు అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్పీ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..
● పంచాయతీ ఎన్నికలు గ్రామ స్వరాజ్యం కోసం జరుగుతున్నాయి. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకున్నప్పుడే గ్రామాలకు పూర్తి స్వీయపాలన, స్వావలంబన సాధ్యమవుతుంది. సర్పంచ్ స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఓటర్లకు బహుమతులు, నగదు, మద్యం ఇచ్చినా.. ఓటర్లు స్వీకరిస్తూ పట్టుబడినా కేసులు నమోదు చేస్తాం.
ఏకగ్రీవాల వేలంపై విచారణ..
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదువులను ఏకగ్రీవం పేరుతో అమ్మొద్దు. జిల్లాలో పలు జీపీల ఏకగ్రీవానికి వేలం నిర్వహించినట్లు తెలిసింది. వాటిపై మూడు కమిటీలను నియమించి.. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టాం. జీపీల ఏకగ్రీవం కోసం వేలం నిర్వహించినట్లు నిజమని తేలితే.. ఆయా గ్రామాల్లో ఏకగ్రీవాలను రద్దుచేసే అవకాశం ఉంటుంది. మొదటి విడతలో 40, రెండో విడతలో 34, మూడో విడతలో 28 జీపీల్లో 102 సమస్యాత్మక గ్రామాలు, 1,048 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. జిల్లాలోని ర్యాలంపాడు, పుల్లూరు, నందిన్నె, బల్గెర వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి.. నిత్యం తనిఖీలు చేపడుతున్నాం. ఎన్నికల కోడ్ ప్రకారం సమావేశాలు, ర్యాలీలు, మైక్ పెట్టి ప్రచారం చేసేందుకు తప్పనిసరిగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పోలీస్‌స్టేషన్ నుంచి రెవెన్యూ అధికారులు రిమార్క్స్ తీసుకొని అనుమతి ఇస్తారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తాం. ఎవరైనా ఒత్తిడి చేసినా, ఇబ్బందులకు గురిచేసినా, అక్రమాలు, నేరాలకు పాల్పడినా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలి.
అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరాలి తప్ప.. ఇతరులను వక్రీకరించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటిలో ఇతరుల మనోభావాలు దెబ్బతీసే పోస్టులపై నిఘా ఉంచాం. వాటిని ఫార్వర్డు చేసినా తగు చర్యలు ఉంటాయి. ఎన్నికల నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం. ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు తదితర సిబ్బందితో వివిధ అంశాలపై ఇప్పటికే సమావేశం నిర్వహించి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోకస్ పెట్టాం. శాంతియత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పక్కా ప్రణాళికలు రూపొందించాం. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ మానిటరింగ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లు తెలిస్తే ప్రజలు పోలీసుశాఖకు సమాచారం అందించాలి.
ముందస్తు బైండోవర్..
గత ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించిన వారితో పాటు పాత నేరస్తులు, ఎన్‌డీపీఎస్ కేసులు ఉన్న 287 మందిని గుర్తించి బైండోవర్ చేశాం. మద్యం తరలిస్తున్న వారిపై 73 కేసులు నమోదుచేసి.. రూ. 6.64లక్షల విలువైన మద్యం (906.265 లీటర్లు) సీజ్ చేశాం. జిల్లాలో గన్ లైసెన్స్ పొందిన వారి నుంచి గన్స్ డిపాజిట్ చేసుకున్నాం. ఓటర్లను ఆకర్షించేందుకు గ్రామాల్లో మందు పార్టీలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాటిపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నాం.
నిర్భయంగా ఓటేయండి


