యూరియా కష్టాలకు చెక్..!
●
యూరియా కొరత ఉండదు
వ్యయసాయ శాఖ రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా రైతులు నేరుగా తమ ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చు. డీలర్ల వద్ద ఎంత స్టాక్ ఉందో తెలుసుకొని యూరియాను బుక్ చేసుకోవచ్చు. పంట విస్తీర్ణం మేరకు యూరియా తీసుకునే అవకాశం ఉంటుంది. – జాన్‌సుధాకర్, డీఏఓ
గద్వాల వ్యవసాయం/నారాయణపేట: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు ఇదివరకు కపస్ యాప్ తీసుకువచ్చి సక్సెస్ కావడంతో .. ఇక యూరియా బుక్ చేసుకునేలా వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫర్టిలైజర్స్ యాప్ ద్వారా రైతులు తమ ఇంటి నుంచి మైబెల్ ఫోన్‌లో యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది యాసంగిలో 1.95 లక్షల ఎకరాల వరకు పంటలు సాగు చేయనుండగా, అందులో 86,529 ఎకరాల్లో వరి సాగు చేయనున్నారని అధికారులు అంచనా వేశారు. ఎకరాకు 3 బస్తాల చొప్పున యూరియా అవసరం ఉండడంతో 5191.74 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లకు అవగాహన సదస్సులు సైతం చేపట్టారు.
22 నుంచి యాప్‌తో యూరియా సరఫరా
వ్యవసాయ శాఖ తయారు చేసిన ప్రత్యేక యాప్ ద్వారా రైతు డీలర్ల వద్ద యూరియా ఉన్న స్టాక్ వివరాలు తెలుస్తాయి. రైతులు తమకు దగ్గరలో ఉన్న డీలర్ నుంచి యూరియా తీసుకునేలా బుక్ చేసుకోవచ్చు. వెంటనే ఐడీ వస్తుంది. ఇందుకనుగుణంగా డీలర్ వద్ద నుంచి యూరియా కొనుగోలు చేసే వీలు కలుగుతుంది. రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. భూవిస్తీర్ణం, వేసిన పంటకనుగుణంగా యూరియా తీసుకునే అవకాశం, పరి మితికి మించి యూరియా వాడకుండా, పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టనున్నారు.
ఎకరాకు మూడు బస్తాల చొప్పున
రెండు ఎకరాలకు ఎక్కువ ఉంటే 15 రోజుల తర్వాత కోనుగోలు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. పట్టాపాసు బుక్‌లేని రైతులు పట్టాపాస్ బుక్ ఆప్షన్లో ఆధార్ నంబర్ ఎంట్రీ చేసి, ఓటీపీ కన్ప ర్మేషన్ ఇచ్చిన తర్వాత వివరాలు నమోదు చేయాలి. కౌలు రైతులు సైతం యూరియా తీసుకోవచ్చు. ఇక యాప్ విషయానికి వస్తే మొబైల్‌లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఎరువుల యాప్ ఓపెన్ చేయగానే, రైతులు, వ్యవసాయశాఖ, డీలర్ల కోసం లాగిన్లు కనిపిస్తాయి. లాగిన్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే డీలర్లు, యూరియా స్టాక్ వివరాలు కనిపిస్తాయి. పట్టాపాసుపుస్తకం నంబర్, పంట విస్తీర్ణం వివరాలు నమోదు చేయాలి. సాగు చేసే పంట విస్తీర్ణం ఆధారంగా అవసరమైన మోతాదులో యూరియా బ్యాగుల కానవస్తుంది. యూరియా బుక్ చేసిన తర్వాత 4 దశల్లో యూరియా అందేలా చర్యలు తీసుకున్నారు.
ఫర్టీలైజర్ యాప్
మొబైల్ యాప్‌లో బుకింగ్ చేసుకునే అవకాశం
కపస్ యాప్ సక్సెస్‌తో యూరియా యాప్ అందుబాటులోకి..
జిల్లాలో 86,529 ఎకరాల్లో వరి సాగు
యాసంగికి 5,191 మెట్రిక్ టన్నులు యూరియా అవసరమవుతాయని అంచనా
ఎకరాకు 3 బస్తాల చొప్పున సరఫరా
యూరియా కష్టాలకు చెక్..!


