రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలి
గద్వాలటౌన్: జిల్లాలో చేనేత రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామక్రిష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ చేనేత రుణమాఫీ ప్రకటించి ఏడాదిన్నర అవుతున్న, జిల్లాలో ఇప్పటి వరకు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రుణమాఫీ ప్రక్రియ నత్తనడకన సాగుతుందని విమర్శించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ సక్రమంగా కార్మికులకు అందడం లేదన్నారు. నేతన్న భరోసా పథకంపై అధికారులు దృష్టిసారించాలన్నారు. చేనేత త్రిఫ్ట్ ఫండ్ పథకం కింద ప్రతి నెల కార్మికుల ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు నిషాక్, వీరేష్, వీరన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే మైనారిటీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నుషిత ప్రకటనలో తెలిపారు. ఏదైన విభాగంలో పీజీ కోర్సులకు సంబంధించి 1.7.2025 నుంచి 31.12.2025 వరకు అడ్మిషన్ పొందిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. అర్హులైన వారు ఆన్‌లైన్ వెబ్‌సైట్ httpr.telangan aeparr.chf.g ov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నివాస ధ్రువీకరణపత్రాలతో పాటు టెన్త్, ఇంటర్, డిగ్రీలతో పాటు అవసరమైన ఇతర పత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేసుకొనటకు చివరి తేదీ 19.1.2026 ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి హార్డ్‌కాపీలను జనవరి 20వ తేదీలోపు తమ కార్యాలయంలో సమర్పించాలని, ఇతక వివరాలకు సెల్ నం.8099059007 ను సంప్రదించాలని పేర్కొన్నారు.
సంతోష్ ట్రోఫీకి
వినోద్‌కుమార్ ఎంపిక
గద్వాలటౌన్: ప్రతిష్టాత్మకమైన సంతోష్ ట్రోఫి ఫుట్‌బాల్ పోటీలకు గద్వాలకు చెందిన యువ క్రీడాకారుడు వినోద్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 28 వరకు ఛత్తీస్‌ఘడ్‌లో జరిగే 79వ జాతీయస్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్ సంతోష్ ట్రోఫి పోటీలు జరగనున్నాయి. సంతోష్ ట్రోఫి కోసం 22 మంది క్రీడాకారులతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టును ఎంపిక చేశారు. ఇందులో గద్వాలకు చెందిన క్రీడాకారుడు వినోద్‌కుమార్ ఉండటం గర్వకారణం. సంతోష్ ట్రోఫి కోసం గత అక్టోబర్‌లో ప్రాబబుల్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో 50 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. తరువాత వారికి నెల రోజుల పాటు హైదరాబాద్‌లోని ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో శిక్షణ ఇచ్చారు. ప్రాబబుల్స్ పోటీలలో అత్యంత క్రీడా నైపుణ్యం కనభర్చిన వినోద్‌కుమార్‌ను రాష్ట్ర తుది జట్టులోకి తీసుకున్నారు. వినోద్‌కుమార్ స్థానిక ఎంఏఎల్‌డీ డిగ్రి కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ ఎంపికపై ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గుణ, జిల్లా అధ్యక్షుడు బండల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, టీం కోచ్ వెంకట్రాములు, ఇంటెలిజెన్స్ సీఐ నర్సింహారాజు హర్షం తెలిపారు.


