మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం
మానవపాడు: మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్యసిబ్బంది పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డా.సంధ్యా కిరణ్మయి సూచించారు. సోమవారం మానవపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లతో డీఎంహెచ్‌ఓ సమావేశమై మాట్లాడారు. గర్భిణులకు క్రమం తప్పకుండా ప్రతినెలా పరీక్షలు చేయడంతో పాటు వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. 30 ఏళ్లు పైబడిన వారికి విధిగా ఎన్‌సీడీ పరీక్షలు చేయాలన్నారు. టీబీ, లెప్రసీ, పాలియేటివ్ కేర్ పేషంట్ల జాబితాను జిల్లా ఆస్పత్రికి పంపించాలని తెలిపారు. పీహెచ్‌సీ పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను వందశాతం నిర్వహించాలని ఆదేశించా రు. సమావేశంలో డా.శారణ్య, జిల్లా కోఆర్డినేటర్ శ్యాంసుందర్, సూపర్‌వైజర్లు హెలెన్, అక్కమ్మ, చంద్రన్న, శేఖర్ ఉన్నారు.
10, 11 తేదీల్లో
పాఠశాలలకు సెలవు
గద్వాల: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో ఈ నెల 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు డీఈఓ విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న మొదటి విడత ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,270
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు సోమవారం 311 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ. 7,270, కనిష్టంగా రూ. 4,616, సరాసరి రూ. 5,270 ధరలు లభించాయి. అదే విధంగా 18 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,880, కనిష్టంగా రూ. 5,520, సరాసరి రూ. 5880 ధరలు వచ్చాయి. 1,023 క్వింటాళ్ల వరి (సోన) విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 2,559, కనిష్టంగా రూ. 1,719, సరాసరి ధరలు రూ. 2,489 ధరలు లభించాయి.
వందశాతం
ఉత్తీర్ణత సాధించాలి
గద్వాలన్యూటౌన్: పదో తరగతి చదువుతున్న సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి నుషిత సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతిగృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలతో పాటు టాయి లెట్లు, వంట గది, విద్యార్థినుల కోసం వండిన ఆహార పదార్థాలను ఆమె పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్, సిబ్బందితో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతినెలా మెడికల్ క్యాంప్ నిర్వహించి.. విద్యార్థినులకు అవసరమైన మందులు అందించాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి విధిగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటుచేసి.. హాస్టల్‌లో కల్పిస్తున్న వసతులు, విద్యార్థినుల చదువు పరిస్థితిని తెలియజేయాలని సూ చించారు. విద్యార్థినులు మధ్యలోనే చదువు మానుకొని, స్వగ్రామాలకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత వసతిగృహ అధికారులదేనని చెప్పారు. అనంతరం పదో తరగతి విద్యార్థినులతో ఆమె సమావేశమై అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ట్యూటర్లు బోధిస్తున్న విధానం, విద్యార్థినుల ప్రగతిపై ఆరా తీశారు. కార్యక్రమంలో వార్డెన్ సుజాత పాల్గొన్నారు.


