కమనీయం.. రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణ వేడుక జరిపారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించి తన్మయం చెందారు. అదే విధంగా శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి పాల్గొన్నారు.


