భక్తులతో కిటకిటలాడిన ఆదిశిలా క్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మోత్సవాలు, జాతర నేపథ్యంలో అర్చకులు ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఉమ్మడి పాలమూరు నుంచేగాక కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అలాగే, జాతర మైదానం భక్తులతో సందడిగా మారింది. గృహోపకరణాలు, గాజులు, మిఠాయి దుకాణాలు, ఆట వస్తువులు, రంగుల రాట్నాల వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, పట్వారి అరవిందరావు, అర్చకులు మధుసూధనాచారి, రమేషాచారి, రవిచారి, దీరేంద్ర దాసు , రాఘవేంద్ర దాసు తదితరులు పాల్గొన్నారు.
‘ప్రభావిత ఉద్యమశక్తి జయరాజ్’
వనపర్తిటౌన్: సమాజాన్ని ప్రభావితం చేసిన శక్తి ప్రముఖ కవి, ఉద్యమ గాయకుడు జయరాజ్‌దే అని సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్ కొనియాడారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు, రాష్ట్ర కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత జయరాజ్‌ను సాహితి కళావేదిక ప్రతినిధులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. కవిగా, గాయకుడిగా తన పంతా మార్చుకోకుండా ముందుకు సాగి తెలంగాణలో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. సమాజాన్ని జాగృతం చేసే ఎన్నో పాటలు రచించి ఉద్యమ నిర్మాణంలో తన భక్తిని చాటారని కొనియాడారు. నిరంతరం పేద, బడుగు, బలహీనవర్గాల పక్షాన నిలబడి పోరాటం సాగిస్తున్నారని పేర్కొన్నారు. జయరాజ్ సాహిత్యం ఎంతోమంది వర్ధమాన కవులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా జయరాజ్ తను రచించిన పలు పుస్తకాలను పలువురు సాహితీవేత్తలకు అందజేశారు. కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు బైరోజు చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్, నరేష్‌కుమార్, శ్యాంసుందర్, ఉప్పరి తిరుమల్లేశ్, రచయితలు డా. వీరయ్య, పపద్మావతి, డా. కంటే నిరంజనయ్య, మధుకర్, కిరణ్‌కుమార్, దర్శన్‌కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
‘ఇన్ సర్వీస్ టీచర్లకు
టెట్ రద్దు చేయాలి’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: విద్యాహక్కు చట్టానికి సవరణ చేసి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రద్దుచేయాలని టీఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏతోపాటు పీఆర్‌సీ అమలుతోపాటు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. అనంతరం సంఘం జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా తాహెర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఎస్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హమీద్‌అలీ, కార్యదర్శి మహమ్మద్ రహమతుల్లా, జిల్లా అధ్యక్షుడు సతీష్‌కుమార్, నాయకులు షేక్‌ఫరీద్, శశిధర్, మల్లికార్జున్, మోహన్, శరణప్ప, మురళి, శ్రీనివాస్, కృష్ణ పాల్గొన్నారు.
ఉచిత శిక్షణ ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఉచిత సైకాలజీ శిక్షణ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ మేరకు నారాయణపేట డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ టెట్ అర్హత పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తరగతులను ఉచితంగా బోధించేందుకు అధ్యాపకుడు జనార్దన్‌రెడ్డి ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మొత్తం 70కిపైగా అభ్యర్థులు శిక్షణకు హాజరయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన ఆదిశిలా క్షేత్రం


