కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
అయిజ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యర్తల సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్‌లకు శాలువాలు, పూలమాలలతో సత్కారం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే నిధులు అడిగేందుకు హక్కు, బాధ్యత ఉండేదని, ఓడిపోయినందుకు నిధులు అడిగేందుకు నైతికమైన అర్హత కోల్పోయానని అన్నారు. నిధులు లేకనో, వనరులు లేకనో గెలిచిన ఎమ్మెల్యేలకే నిధులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయినా సరే నిధులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలముందు ఎన్నో హామీలు ఇచ్చిన ఎమ్మెల్సీ చల్లా వెంట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకాపురం రాముడు, షేక్షావలి ఆచారి, జయరాముడు, మద్దిలేటి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


