గద్వాల కోసం ఏం సాధించారో ఎమ్మెల్యే చెప్పాలి
గద్వాలటౌన్: నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, రెండేళ్లలో ప్రత్యేకంగా ఏం అభివృద్ధి సాధించారో ప్రజలకు చెప్పాలని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ నిలదీశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సొంత ప్రయోజనాలు, రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్యే పార్టీ మారారని ధ్వజమెత్తారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు. రేవులపల్లి వద్ద వెంటనే ప్రాజెక్టు సేప్టీ బ్రిడ్జి కట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, సంక్షేమ పథకాలతోనే రాష్ట్రంలో, జిల్లాలో అభివృద్ధి కొనసాగుతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కేంద్రం సాయంతోనే 75 శాతం గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సీఎం, ఇద్దరు మంత్రులున్నా వారు పదవులు నిలుపుకొనేందుకు, గ్రూపు రాజకీయాలను కట్టడి చేయడానికి తప్ప జిల్లా అభివృద్ధికి ఇచ్చిన నిధులు శూన్యమని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని, కేవలం 20 శాతం మాత్రమే కల్పించి మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను నిండా మోసం చేశారని విమర్శించారు. రెండేళ్లలో ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకొంటున్నారని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్పంచులతో పనులు చేయించుకుని బిల్లులు ఇవ్వకుండా అప్పులపాలు చేసిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలలో బీజేపీ మద్దతుదారులను గెలిపిస్తే.. ఆయా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఇన్‌చార్జి బాబురెడ్డి, నాయకులు రామంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, శ్యామ్‌రావు, రాజగోపాల్, శివారెడ్డి, జయశ్రీ, సమత తదితరులు పాల్గొన్నారు.


