పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
గద్వాల న్యూటౌన్: జోనల్ అధికారులు ఇతర అధికారులను సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రమేష్‌బాబు, డీపీఓ శ్రీకాంత్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీ హాల్‌లో మూడు విడతల్లో విధులు నిర్వర్తించే జోనల్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలింగ్ నిర్వహణకు ఒకరోజు ముందుగానే పోలింగ్ సామగ్రి అందించే ప్రిసైడింగ్ అధికారులకు జోనల్ అధికారులు సహకరించాలని సూచించారు. ఆయా పంచాయతీల్లో 87 మంది జోనల్ అధికారులకు రూట్ల ప్రకారం బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని చెప్పారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడైనా సమస్యలు వచ్చినా, సామగ్రి కొరత ఏర్పడినా వెంటనే అక్కడి సిబ్బందికి సహకారం అందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయి పోలింగ్ సామగ్రిని రిసెప్షన్ కేంద్రంలో అప్పగించేంతవరకు ఆయా రూట్లవారీగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు విజయవంతం చేయాలని సూచించారు.


