పంచాయతీ ఎన్నికలపై పటిష్ట నిఘా
● చెక్‌పోస్టుల వద్ద
తనిఖీలు తప్పనిసరి
● డీఐజీ చౌహాన్
వెల్లడి
గద్వాల క్రైం: సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డీఐజీ చౌహాన్ స్పష్టం చేశారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు, సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రెండు రాష్ట్రాల సరిహద్దులు కావడంతో అక్రమంగా మద్యం, నగదు, మాదకద్రవ్యాలు సరఫరా చేసే వెసులుబాటు ఉంటుంని నిఘా వర్గాలు స్పష్టం చేశాయన్నారు. ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు పెద్ద మొత్తంలో నగదు, వస్తు సామగ్రి, మద్యం తదితర వాటితో తమ వైపునకు అభ్యర్థులు, నాయకులు తిప్పుకుంటారనే నివేదికలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఎన్నికలు సజావుగా సాగించాలనే లక్ష్యంతో ఎన్నికల కమిషన్ ముందుస్తు చర్యలకు శ్రీకారం చేపట్టిందన్నారు. సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలన్నారు. అనుమానిత వాహనాలను విధిగా తనిఖీ చేయాలన్నారు. విధిగా హైవే పెట్రోలింగ్, మొబైల్ పెట్రోలింగ్ చేయాలని, సామాజిక మాద్యమాలు, గ్రూపుల ద్వారా సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, టాటబాబు, రవిబాబు, ఎస్‌ఐలు తదితరులు ఉన్నారు.


