కనులపండువగా ప్రభోత్సవం
మక్తల్: మక్తల్ పడమటి ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రభోత్సవ వేడుకలు కనులపండువగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ప్రభోత్సవ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలోని రాంలీలా మైదానం కిటకిటలాడింది. ముందుగా ఆలయ చైర్మన్ ప్రాణేష్‌కుమార్ తదితరులు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. తరువాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ప్రతిష్టించి పట్టణంలోని మెయిన్ రోడ్‌లో ఉన్న గోధా ఆంజనేయ స్వామి దేవాలయం వరకు భజన బృందాల నడుమ పల్లకీ యాత్ర నిర్వహించారు. భక్తులు, ప్రముఖులు ప్రభోత్సవానికి హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టారు. ప్రభోత్సవాన్ని పడమర దిక్కున ఉన్న చిన్న ఆంజనేయ స్వామి దేవాలయం వరకు లాగారు. అక్కడ విశేష పూజ లు నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయం వద్దకు ప్రభోత్సవాన్ని తీసుకువచ్చారు.
వేరుశనగ క్వింటా రూ.7,522
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు బుధవారం 261 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్టం రూ.7522, కనిష్టం రూ.4339, సరాసరి రూ. 5690 ధరలు లభించాయి. అలాగే, 4 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5960, కనిష్టం రూ. 5760, సరాసరి రూ. 5760 ధరలు పలికాయి. 1384 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2859, కనిష్టం రూ. 1718, సరాసరి ధరలు రూ. 2576 వచ్చాయి. 5 క్వింటాళ్ల వరి (హంస) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి ధర రూ. 6201 లభించింది.


