రాజకీయ వేఢీ!
మొదటి విడత పంచాయతీ పోరు రసవత్తరం
● ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగాప్రధాన పార్టీల వ్యూహరచన
● తిరుగుబాటు అభ్యర్థుల
బెడద లేకుండా జాగ్రత్తలు
● నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు
బుజ్జగింపులు.. బేరసారాలు
జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో బుజ్జగింపులు, బేరసారాల పర్వానికి తెర లేచింది. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు బేరసారాలు ప్రారంభించారు. తమ పార్టీ మద్దతుతో పోటీ చేసిన రెబల్స్‌తో సంప్రదింపులు.. రాయబారాలు జరుపుతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులతో రాజీ కుదుర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. ‘ఇదంతా కాదయ్యా.. నాకు కచ్చితంగా వందకు పైగా ఓట్లు ఉన్నాయ్. ఏంటో చెప్పు..’ అంటూ కొందరు అప్పుడే బేరాలు ప్రారంభించారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
గద్వాలటౌన్: జిల్లాలో మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పల్లెల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమైనప్పటికీ ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో పరిస్థితిని ముఖ్య నేతలు ముందుగానే పసిగట్టి.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి పంచాయతీ ఎన్నికలు కావడంతో తమ బలాబలాలను అంచనా వేసుకోవడానికి ప్రధాన పార్టీలు స్థానిక సంస్థలను వేదికగా భావిస్తున్నాయి. ఆ దిశగానే ఆయా పార్టీల ముఖ్య నేతలు ఎన్నికల వ్యూహ ప్రణాళికల్లో మునిగిపోయారు.
వార్డు స్థానాలకు వచ్చిన నామినేషన్లు 1,903
సర్పంచ్‌కు దాఖలైన నామినేషన్లు
724
రాజకీయ వేఢీ!


