నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
అలంపూర్ రూరల్: రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని డీఏఓ సక్రియా నాయక్ సూచించారు. మంగళవారం అలంపూర్ మండలం క్యాతూర్‌లో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. క్యాతూర్‌లో ఇప్పటి వరకు 533 మంది రైతుల నుంచి 34వేల క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొంటుందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డీఏఓ వెంట సింగిల్‌విండో సీఈఓ హుస్సేన్ పీరా, వ్యవసాయ విస్తరణాధికారి మానస ఉన్నారు.
క్రీడల్లో రాణించాలి
ఎర్రవల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పదో పటాలం కమాండెంట్ జయరాజు అన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన అస్మితా జిల్లాస్థాయి అథ్లెటిక్ మీట్‌లో పదవ బెటాలియన్ సాయుధ చైతన్య పాఠశాలకు చెందిన విద్యార్థులు మల్లిక, వైష్ణవి, వినంద, భార్గవి, నందిని, కీర్తి ఉత్తమ ప్రతిభకనబరిచి బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం వారిని పదో పటాలం కార్యాలయంలో కమాండెంట్ అభినందించారు. భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్ ఆర్పీ సింగ్, ఆర్‌ఐలు తిరుపతి, ప్రసన్నకుమార్, ప్రిన్సిపాల్ షేక్షావలి, పీఈటీ హైదర్‌పాషా పాల్గొన్నారు.
నాణ్యమైన ఆహారం
అందించడంలో విఫలం
గద్వాల: సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థ్ధులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రవీణ్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్టీ బాలుర హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కారణంగా 15మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం బాధాకరమన్నారు. జిల్లా అధికారులు హాస్టళ్లను తనిఖీలు చేస్తున్నా ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఎస్టీ బాలుర హాస్టల్ వార్డెన్‌ను సస్పెన్షన్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు భరత్, నరేశ్, శరత్ ఉన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
అలంపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం అలంపూర్‌లోని కేవీపీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సీపీఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం నిరంతరం పోరాడుతుందన్నారు. కార్మిక లోకానికి అండగా నిలవడంతో పాటు రైతుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేపడుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సీపీఎం బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం పట్టణంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి.. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. గన్నీబ్యాగుల కొరతతో కొనుగోళ్లు నిలిచిపోతున్నాయని.. రోజుల తరబడి రైతులు కేంద్రాల్లోనే ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వార్షాలు వచ్చి ధాన్యం తడిసి రైతులు నష్టపోతే బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు. మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రేపల్లె దేవదాసు, జీకే ఈదన్న, నర్సింహ, అలీక్బర్, బంగారు రఫీ పాల్గొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి


