వేరుశనగ క్వింటాల్ రూ.5,729
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 193 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ. 5,729, కనిష్టంగా రూ. 4,516, సరాసరి రూ. 6,489 ధరలు వచ్చాయి. అదే విధంగా 19 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,941, కనిష్టంగా రూ. 5,519, సరాసరి రూ. 5,941 ధరలు లభించాయి. 1,810 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,850, కనిష్టంగా రూ. 1,932, సరాసరి ధరలు రూ. 2,709 ధరలు వచ్చాయి.
మానవసేవే మాధవ సేవ
మల్దకల్: మానవసేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ భావించాలని.. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా భక్తులను అనుగ్రహిస్తారని హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతిస్వామి అన్నారు. మంగళవారం మల్దకల్ ఆదిశిలా క్షేత్రాన్ని పీఠాధిపతి సందర్శించగా.. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో భక్తులకు వేద ప్రవచనాలు వినిపించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ భక్తిభావం అలవర్చుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. సన్మార్గంలో పయనించినప్పుడే దేవుడి అనుగ్రహం పొందుతారని అన్నారు. కార్యక్రమంలో పట్వారి అరవిందరావు, చంద్రశేఖర్‌రావు, బాబూరావు, మధుసూదన్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు నాగరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.


