విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
ఎర్రవల్లి: విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కలిసికట్టుగా కృషిచేయాలని ఎస్‌ఎస్‌ఎ రాష్ట్ర పరిశీలకులు మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొండేరు ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎల్‌ఎస్, ఎల్‌ఈపి, ఎఎక్స్‌ఎల్ సంబంధిత కార్యక్రమాలను పరిశీలించి వాటి అమలు, పురోగతిపై ఆరా తీశారు. విద్యార్థుల పఠనా సామర్థ్యాలను, అక్షరమాల, వివిద పరీక్షల ఫలితాలను పరిశీలించారు. ప్రభుత్వం, ఇతర స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి అంపయ్య, ఎంఈఓ అమీర్‌ఫాష, హెచ్‌ఎం పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఏకగ్రీవాలు
గద్వాలటౌన్: జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఏకగ్రీవాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకగ్రీవ ఎన్నికల వల్ల కులం, డబ్బు ప్రాతిపదికన పెత్తందారులకు, ధనవంతులకు మాత్రమే రాజకీయ అవకాశం ఉంటుందన్నారు. రూ.లక్షలు పెట్టి ఏకగ్రీవాలు చేసుకుంటున్న అభ్యర్థులు గ్రామ అభివృద్ధికి ఏం కృషిచేస్తారని ప్రశ్నించారు. ఏకగ్రీవ ఎన్నికల ద్వారా ప్రజలు రాజ్యాంగం కల్పించిన ఓటు వేసే హక్కును, ఎన్నికలలో పోటీచేసే హక్కు, నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే హక్కును కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకగ్రీవాల పేరుతో ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.లక్షలు పెట్టిన అభ్యర్థులు గ్రామ సమస్యలపై కృషి చేయకపోగా, అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. గతంలో ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నజరాలను ప్రకటించలేదనే విషయాలను గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు రాజు, వీవీ నర్సింహా, ఉప్పేర్ నర్సింహా, సవారన్న పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.7,509
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్ యార్డుకు శుక్రవారం 185 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గరిష్ట ధర రూ.7509, కనిష్టం రూ. 4349, సరాసరి రూ. 6869 ధరలు లభించాయి. అలాగే, 9 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ.5859, కనిష్టం రూ.5536, సరాసరి రూ.5759 ధరలు పలికాయి. 1477 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2701, కనిష్టం రూ. 1786 ధరలు వచ్చాయి.
విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి


