హెచ్చరికలు బేఖాతర్
గద్వాలటౌన్: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు వేలం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన హెచ్చరికలను జిల్లాలో పట్టించుకోవడం లేదు. జిల్లాలో పంచాయతీలకు జరుగుతున్న వేలం ప్రక్రియను చూస్తే ఎన్నికల సంఘానికే సవాల్ విసురుతున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల సంఘం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రెండవ రోజు సైతం పలు గ్రామాలలో వేలం ప్రక్రియ నిర్వహించారు. గ్రామాభివృద్ధి అంటూ స్థానిక పెద్దలే ముందుండి ఈ తంతు కొనసాగించారు. రూ.20 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు వేలంవేసి సర్పంచు పదవులను కొనుగోలు చేశారు. ఈ తతంగం జిల్లా అధికార యంత్రాంగానికి తెలిసినా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
రెండో విడతలోనూ...
రెండో విడత ఎన్నికలు జరిగే మల్దకల్, అయిజ మండలాల్లో సైతం వేలం ద్వారా సర్పంచు స్థానాలను కై వసం చేసుకున్నారు. మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామ సర్పంచ్ స్థానం జనరల్‌కు రిజర్వు అయింది. ఇక్కడ ఏకంగా రూ.42 లక్షల వ్యయంతో శ్మశానవాటిక నిర్మాణానికి వేలం ద్వారా ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన సీడ్ ఆర్గనైజర్ ఆ డబ్బును ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. మగ్గంపేట, బిజ్వారం, పెదొడ్డి గ్రామాలలో సైతం ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయిజ మండలం కుర్వపల్లి సర్పంచ్ పదవిని రూ. 7.50లక్షలకు వేలంలో పాటపాడి కై వసం చేసుకున్నారు. కిష్టాపురం గ్రామ పంచాయతీ పదవికి జరిగిన వేలంలో కాటన్ వ్యాపారి పాల్గొని రూ.10.35 లక్షలకు సర్పంచ్ స్థానాన్ని పొందారు. యాపదిన్నె గ్రామంలో ఏకగ్రీవ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఏకగ్రీవాల సంఖ్య శనివారం నాటికి మరికొన్ని పెరిగే అవకాశం ఉంది.
సర్పంచ్ పదవులకు రెండో రోజు కొనసాగిన వేలం
రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్న అభ్యర్థులు
అపహాస్యమవుతున్న పంచాయతీ ఎన్నికలు
చోద్యం చూస్తున్న అధికారులు


