అమ్మకానికి సర్పంచ్‌లు
● వేలంలో కొనుగోలు చేస్తున్న సర్పంచు అభ్యర్థులు
● అపహాస్యమవుతున్న పంచాయతీ ఎన్నికలు
● చోద్యం చూస్తున్న అధికారులు
గద్వాలటౌన్: జిల్లాలోని తొలిదశ ఎన్నికలు జరిగే గద్వాల, ధరూరు, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో సర్పంచు పదవి కాస్ట్‌లీగా మారింది. వేలం ద్వారా కొన్ని సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధి, గుడి నిర్మాణాలు, శ్మశాన వాటికలకు స్థలాలు ఇవ్వడం తదితర కారణాలపై ఏకగ్రీవాలు అయినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి..
● గద్వాల మండలం కొండపల్లి గ్రామ సర్పంచ్ స్థానం జనరల్‌కు రిజర్వు అయింది. ఇక్కడ ఏకంగా రూ.60 లక్షల వ్యయంతో గుడి నిర్మాణానికి వేలం ద్వారా ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన సీడ్ ఆర్గనైజర్ ఆ డబ్బు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన వెంటనే కొంత డబ్బు చెల్లించి గుడి పనులు చేపట్టేలా ని ర్ణయం తీసుకున్నారు. ఈడిగోనిపల్లి గ్రామంలో సై తం వేలం పాట నిర్వహించారు. కొంతమంది నుంచి అభ్యంతరాలు రావడంతో వాయిదా పడింది.
● గట్టు మండలంలో గొర్లఖాన్‌దొడ్డి సర్పంచు స్థానం బీసీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. ఏకంగా రూ.57లక్షలకు వేలంపాట పాడి సర్పంచు పదవిని కొనుగోలు చేశారు. అదేవిధంగా ముచ్చోనిపల్లి గ్రామ సర్పంచు స్థానం జనరల్‌కు రిజర్వు అయింది. ఇక్కడ రూ.14.90 లక్షలకు వేలం పాట పాడి సర్పంచు స్థానాన్ని కై వసం చేసుకున్నారు. అరగిద్ద గ్రామ సర్పంచు పదవికి సైతం వేలం నిర్వహించినట్లు సమాచారం. గ్రామ నాయకుడు ఒకరు రూ.35 లక్షల వరకు వేలం పాట పాడి సర్పంచ్ స్థానాన్ని కై వసం చేసుకోవడానికి యత్నించారు. చివరి నిమిషంలో మరో నాయకుడు అడ్డు తగిలారు. దీంతో వేలం శుక్రవానికి వాయిదా పడింది. అంతంపల్లి గ్రామ సర్పంచ్ స్థానం కోసం వేలం నిర్వహిస్తే.. రూ. 24 లక్షలకు పాటపాడారు. అయితే ఆ డబ్బులు తనకు ఇవ్వాలని గ్రామ మాజీ ప్రజాప్రతినిధి అభ్యంతరం తెలిపారు. గతంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాలేదని వాపోయారు. దీంతో ఈ వేలం అర్ధాంతరంగా నిలిచిపోయింది. తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి శుక్రవారం వేలం నిర్వహించనున్నట్లు తెలిసింది.
● కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామ సర్పంచ్ బీసీ జనరల్ స్థానానికి రిజర్వు అయ్యింది. గ్రామ సర్పంచ్‌గా ఓ వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు. ప్రకటించిన తరువాత గెలుపు సంబరాలు సైతం నిర్వహించారు. రూ.38 లక్షలు గ్రామాభివృద్ధి కోసం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు తెలిసింది. ఉమిత్యాల తండాలో సైతం వేలం ద్వారా ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన ఒకరు రూ.12 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. సర్పంచ్ స్థానం ఇక్కడ కూడా ఏకగ్రీవం అయినట్లు సమాచారం. మరికొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
● టంకర @ రూ.కోటి
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని టంకర్ గ్రామ సర్పంచ్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. గ్రామానికి చెందిన ఓ భూ స్వామి, ధాన్యం వ్యాపారి వేలం పాటలో రూ.కోటికి సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేలా పెద్దలతో ఒప్పందం చేసుకున్నాడు. గ్రామంలో ఆంజనేయ ఆలయ నిర్మాణానికి ఈ నిధులు వెచ్చించేలా.. ఆలయ కమిటీ పేరిట బ్యాంక్‌లో జమచేయాలని నిర్ణయించారు. నామినేషన్ వేసేటప్పుడు రూ.44 లక్షలు.. సర్పంచ్‌గా ధ్రువీకరణపత్రం అందుకున్న తర్వాత మిగిలిన రూ.56 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా మహమ్మదాబాద్ మండలంలోని ఆముదాలగడ్డ తండాలో యువకులు గ్రామ పెద్దలతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుల పదవులకు వేలం వేయడం అక్రమం. వేలం ద్వారా పదవులు పొందితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారు శిక్షార్హులు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలుశిక్షతో పాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటును ఎదుర్కొంటారు.
– రాష్ట్ర ఎన్నికల కమిషనర్
రాణి కుముదిని హెచ్చరిక
అమ్మకానికి సర్పంచ్‌లు


