సీజనల్ ముప్పు
● అంతకంతకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
● ఆస్పత్రుల్లో జలుబు, దగ్గు కేసులు రెట్టింపు
● పిల్లలు, వృద్ధులకు న్యూమోనియా ముప్పు
● అప్రమత్తం చేస్తున్న ఆరోగ్యశాఖ
గద్వాల క్రైం: చలికాలం మొదలు కాగా.. ఇటీవల ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. దీంతో జిల్లాలో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూజ్వరం, ఆయాసంతో బాధపడుతున్న చిన్నారులు, వృద్ధులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రధానం అప్పుడే పుట్టిన శిశువులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై న్యూమోనియా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గడిచిన మూడేళ్లలో జిల్లాలో 1,127 న్యూమోనియాతో బాధపడుతూ చికిత్స పొందినట్లు వైద్యుల రికార్డుల ఆధారంగా తెలుస్తోంది.
న్యూమోనియాతో సతమతం
గాలిలోని వైరస్, బ్యాక్టీరియా ద్వారా న్యూమోనియా వ్యాధి భారిన పడతారు. జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసలో ఎగవేత, పక్కటెముకలు ఎగరడం, నిస్సత్తువగా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు న్యూమోనియా భారిన పడుతున్నారు. చలికాలంలో తుగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. ఐదేళ్లలోపు పిల్లలు, 65 సంవత్సరాలు దాటిన వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో న్యూమోనియా భారిన పడుతున్నారు. జనవరి నుంచి ప్రస్తుతం వరకు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో 426 మంది న్యూమోనియా భారిన పడి చికిత్స పొందారు.
స్వీయ జాగ్రత్తలతో మేలు..
జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందుతోంది. న్యూమోనియాతో బాధపడే వారిని త్వరగా సమీప ఆస్పత్రికి వెళ్లాలి. సాధ్యమైనంత వరకు మొదటి దశలో వ్యాధి ప్రాథమిక లక్షణాలను గుర్తించి చికిత్స అందిస్తే తీవ్రతను తగ్గించవచ్చు అని వైద్యులు, వైద్య సిబ్బంది జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుత చలి కాలంలో చిన్నారులు, వృద్ధుల్లో శ్వాస సంబంధ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చల్లటి ప్రదేశంలో తిరిగినా, చల్లటి ఆహారం తీసుకున్నా, ఏసీ గదుల్లో ఉన్నా సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. ఈ సీజనల్ వ్యాధులతో బాధపడే వారు మందులు వాడకపోతే సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉంది.
సీజనల్ ముప్పు


