భారత రాజ్యాంగం.. ప్రజల మార్గదర్శక గ్రంథం
గద్వాలటౌన్: భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదని, అది ప్రతి పౌరుడి నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన మార్గదర్శక గ్రంథమని అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్‌నాయక్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై రాజ్యాంగం ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగంలోని మౌలిక హక్కులు, మౌలిక కర్తవ్యాలు, సెక్షన్లు, వివిధ ఆర్టికల్స్ గురించి అవగాహన కల్పించారు. పోక్సో చట్టం, బాలకార్మిక నిషేద చట్టం, బాల్య వివాహ నిరోధక చట్ట వంటి చట్టాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని, దాని సాధించడం కోసం పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో రాజ్యాంత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు రాజేందర్, శ్రీనివాసులు, లక్ష్మణ్‌స్వామి, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ, ఎస్సై జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి పౌరుడు హక్కులు తెలుసుకోవాలి
గద్వాల క్రైం: రాజ్యాంగంలో అందించిన హక్కులను ప్రతి పౌరుడు తెలుసుకుని ముందుకెళ్లాలని, స్వాతంత్య్రం పొందిన తర్వాత రాజ్యాంగ రూపకల్పనకు బీఆర్ అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎందరో మహాత్ముల త్యాగ ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని, అన్ని వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం రచించారన్నారు.
రాజ్యాంగ విలువలు కాపాడాలి
ఎర్రవల్లి: ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరించి విలువలను కాపాడాలని బీచుపల్లి పదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పాణి అన్నారు. బుధవారం బీచుపల్లి పదో బెటాలియన్ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకత్వం వహించే ప్రామానిక పాలనా పత్రం అని, ప్రతి పోలీస్ సిబ్బంది ప్రజల హక్కులను గౌరవిస్తూ నిజాయితీగా విధులు నిర్వర్తించాల్సిన బాధత ఉందని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. మనకు రాజ్యాంగాన్ని అందించడంలో కీలకపాత్రను పోషించారన్నారు. దేశ ప్రజలు కుల, మతాలకు అతీతంగా స్వేచ్చగా జీవించడానికి ముఖ్యమైన ఆధారం రాజ్యాంగమేనని ఆయన అన్నారు. అనంతరం పటాలం అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యంగంలోని ప్రియంబుల్ (పఠిక)ను పఠించి ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో ఆర్‌ఐలు ధర్మారావు, రాజేశం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


