బాలికలకు స్వీయ రక్షణ ఎంతో అవసరం
ఎర్రవల్లి: బాలికలకు స్వీయ రక్షణ శిక్షణ ఎంతో అవసరమని, విధిగా రక్షణ విధానాలు నేర్చుకోవాలని డీఎస్పీ మొగిలయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సరస్వతీ పాఠశాలలో జిల్లా భరోసా కేంద్రం ఆధ్వర్యంలో డిజిటల్ హింసకు ముగింపు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎస్పీ హాజరై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వాటి వల్ల కలిగే అనార్థాలు, భవిష్యత్తులో జరిగే వివిద పరిణామాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. చదువు వల్ల భవిష్యత్తులో ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. చెడు వ్యసనాల భారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. అనంతరం లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ఉద్యమం – డిజిటల్ హింసకు ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో కలిసి డిఎస్పీ ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. రోసా కోఆర్డినేటర్ శివాని, సిబ్బంది స్రవంతి, శ్వేత, పాఠశాల యాజమాన్యం గోవర్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలి
గద్వాలన్యూటౌన్: కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ)గద్వాల బ్రాంచ్ సెక్రటరీ బంగి రంగారావ్ డిమాండ్ చేశారు. లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఏఐఐఈఏ గద్వాల ఎల్‌ఐసీ బ్రాంచ్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల భవిష్యత్‌లో స్థిరమైన ఉపాధి ఉండదని, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిట్ ద్వారా ఎంతో నైపుణ్యం కల్గిన నిరుద్యోగులను పరిమిత కాలానికి ఉపయోగించుకునేలా ఉందని చెప్పారు. ఇప్పటికే కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో అప్రెంటీస్ పేరుతో తాత్కాలిక ఉద్యోగ నియమకాలు చేపట్టారని విమర్శించారు. ఈ లేబర్ కోడ్‌ల వల్ల అనేక సంఘటిత రంగాల్లో కూడా ఇలాంటి తాత్కాలిక నియామకాలు పెరిగే అవకాశం ఉందన్నారు. దీనిద్వార సంఘటిత రంగాలన్నీ జవాబుదారీతనం లేకుండా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె నోటీసును 15రోజుల నుంచి 60రోజులకు పెంచి, సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత కూడా కన్సలేటరీ, ఆర్బీ మీటింగ్‌లనే పేరుతో కాలయాపన చేస్తూ, కార్మికుల హక్కులపై ఏమాత్రం శ్రద్ద లేకుండా నిర్లక్ష్యం వహించేలా లేబర్‌కోడ్‌లు రూపొందించబడ్డాయని ఆరోపించారు. నాలుగులేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఐఈఏ బ్రాంచ్ అద్యక్షుడు నర్సింగ్, రాఘవేంద్ర, సూరజ్, శివశంకర్, ఉదయ్‌కుమార్, మనీష్, సుదర్శన్‌శెట్టి, శైలేష్, కృష్ణచైతన్య, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
బాలికలకు స్వీయ రక్షణ ఎంతో అవసరం


