ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేయాలి
గద్వాలటౌన్: స్థానిక సంస్థల ఎన్నికలలో నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియామవళిని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లతో ఎన్నికల విధులకు సంబంధించి మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికలలో ఆయా మండలాల తహసీల్దార్లు.. ఎంపీడీఓలకు సహకరించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, షెడ్యూల్ ప్రకారం నామినేషన్లను తీసుకోవాలని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ చేపట్టరాదన్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బంది లేదని, ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
● ఇదిలాఉండగా, మాస్టర్ ట్రైనర్స్‌కు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. తదనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
● తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, ఎస్పీలకు ఎన్నికల నిర్వహణపై దిశానిర్ధేశం చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాలు, జియో లోకేషన్లును టీఈ పోల్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషినల్ కలెక్టర్ లక్ష్మినారాయణ, నర్సింగరావు, ఇతర శాఖల అధికారులు శ్రీనివాసరావు, మనోజ్‌కుమార్‌రెడ్డి, రాజ్‌కుమార్, నాగేంద్రం, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
29న జిల్లా స్థాయి క్రీడా పోటీలు
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు పోటీలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.


