వందేళ్ల సుదీర్ఘమైన పోరాటం సీపీఐది..
● ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు..
● రాష్ట్ర బస్సు జాతా ప్రారంభంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి
గద్వాల: వందేళ్లు సుదీర్ఘమైన పోరాటాలు చేసిన ఘనత సీపీఐది అని.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ పార్టీ స్థాపించి వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో పాతబ బస్టాండ్‌లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బస్సు జాతాను పల్లా వెంకటరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ బస్సు జాతాను గద్వాలలో ప్రారంభించి, కొత్తగూడెంలో ముగించనున్నామన్నారు. గద్వాల ప్రాంతం ఆది నుంచి కూడా పోరాటాల గడ్డ, వీరయోధులను కన్నగడ్డ అని కొనియాడారు. ప్రతి వ్యక్తి సీపీఐ జెండాను పట్టి నడిగడ్డ సమస్యలపై పోరాడాలన్నారు. కమ్యూనిస్టు పార్టీల పోరాటంతోనే రాష్ట్ర, కేంద్రస్థాయిలలో పాలకుల అరాచకాన్ని తిప్పికొట్టడం సాధ్యమవుతుందన్నారు. దేశంలోని సామాన్యులు, పేదప్రజలు, కార్మికులు, రైతులు, ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన ఘనత సీపీఐ పార్టీదన్నారు. దేశాన్ని బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం పోరాటం జరిపిందన్నారు. అదేవిధంగా నైజాంపాలన విముక్తి నుంచి పోరాడి రాచరిక పాలన నుంచి ప్రజలకు విముక్తి పొందేలా చేసిందన్నారు. నేటికి ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసిందన్నారు. దున్నేవాడిదే భూమికావాలని భూదానం చేసిన ఘనత సీపీఐకే దక్కుతుందన్నారను.
దేశ సమైక్యతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు..
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులతో చేతులు కలిపి మనదేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేసిందన్నారు. మతం పేరిట ప్రజలను వర్గాలుగా విభజించి దేశసమైక్యతను దెబ్బతిస్తుందని విమర్శించారు. వీటన్నింటిపై సీపీఐ ప్రజాఉద్యమాలు చేపట్టి దేశసమైఖ్యతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పార్టీ వందేళ్ల ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 26వ తేదీన ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల మందితో భారీ బహిరంసభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలనర్సింహా, జిల్లా కార్యదర్శి ఆంజనేయలు, రంగన్న, ఆశన్న, వెంకట్రాములు, ప్రభాకర్, వెంకటస్వామి, చెన్నయ్య, రవి, నాగార్జున, పరమేష్, ప్రవీణ్, వీరేష్, భరత్, గురుస్వామి, భీమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


