రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
గద్వాల: రైతుల సంక్షేమ కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లిస్తూ వరి, పత్తి, మొక్కజొన్న పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని, ఈ కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన పత్తిని నాణ్యతా ప్రమాణాలు సరిగ్గాలేవని తిరస్కరించే పరిస్థితి తలెత్తకుండా ముందస్తుగానే రైతులకు నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలన్నారు. మొక్కజొన్న సేకరణ ప్రక్రియ మొదలుపెట్టినట్లు, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం ప్రారంభించినట్లు తెలిపారు. వీటిసేకరణలో తగు చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమావేశంలో డీఏఓ సక్రియానాయక్, ఏడీ సంగీతలక్ష్మీ, హార్టికల్చర్ అధికారి అక్బర్‌బాషా, డీఎస్‌వో స్వామి కుమార్, మార్కెట్‌ఫెడ్ అధికారి చంద్రమౌళి, జగ్గునాయక్, సీసీపై ప్రతినిధి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.


