దళారులను నమ్మి మోసపోవద్దు
ఎర్రవల్లి: రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం మండలంలోని తిమ్మాపురం, కొండేరు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులతో పాటు టార్పాలిన్ కవర్లు, ఖాళీ సంచులు అందుబాటులో ఉండేటట్లు చూడాలన్నారు. దాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే నగదును వారి ఖాతాల్లో జమచేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నీలి శ్రీనివాసులు, నాయకులు నారాయణ నాయుడు, శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్ యాదవ్, సోమనాద్రి, శంకర్‌నాయుడు, ఈరన్న, వీరన్న, ఉమాపతి నాయుడు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ విషయంలో స్వల్ప వివాదం..
ఇదిలాఉండగా, కొండేరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం వద్ద స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే విజయుడు కొనుగోలు సెంటర్‌ను ప్రారంభించడం కంటే ముందే కాంగ్రెస్ నాయకులు రిబ్బన్ కట్ చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రోటోకాల్ పాటించకుండా కొనుగోలు కేంద్రాన్ని ఎలా ప్రారంభిస్తారని బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఇటిక్యాల ఎస్‌ఐ రవినాయక్, సిబ్బంది ఇరు పార్టీల నాయకులకు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది.


