న్యాయవాదుల పాదయాత్రకు తాత్కాలిక విరామం
అలంపూర్: న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన పాదయాత్రకు తాత్కాలిక విరామం పలికినట్లు అలంపూర్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు తెలిపారు. శనివారం అలంపూర్ కోర్టులోని న్యాయవాదుల సమావేశ మందిరంలో బార్ అసోసియేషన్ సమావేశం నిర్వహించగా.. ఈమేరకు శ్రీనివాసులు మాట్లాడారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 9వ తేదిన అలంపూర్ టు హైదరాబాద్ అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టామన్నారు. ప్రధానంగా న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు రూ.5 వేల స్టైఫండ్, హెల్త్ కార్డులు ఇవ్వాలని, సీఆర్‌పీసీ సెక్షన్ 41(ఏ ), బీఎన్‌ఎస్ సెక్షన్ 35(1) అమైన్మెంట్ చేయాలనే డిమాండ్‌లతో పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ యాత్ర భూత్పూర్ వరకు కొనసాగినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పాదయాత్ర చేపట్టిన బార్ అసోసియేషన్ సభ్యులను కలిశారని, త్వరలోనే న్యాయవాదులను సీఎం రేవంత్‌రెడ్డితో కలిపించి వారి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈమేరకు పాదయాత్ర నిలిపివేయాలని కోరారని, వారి హామీ మేరకు న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే ఆశాభావంతో పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ఒకవేళ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు పోరాటాలు, ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో బార్ అసోసియేషన్ సభ్యులు నరసింహ్మా, తిమ్మారెడ్డి, మధు, ఆంజనేయులు, శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, యాకోబు తదితరులు ఉన్నారు.


