ప్రత్యేక లోక్ అదాలత్‌లో 175 కేసులు పరిష్కారం
గద్వాల క్రైం: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు శనివారం గద్వాల కోర్టు ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో 139 కేసులు పరిష్కారమైనట్లు లోక్ అదాలత్ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి ఎన్ ప్రేమలత తెలిపారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్, ప్రమాద తదితర పెండింగ్ కేసులకు సంబంధించి ఇరువర్గాల వారికి రాజీ కుదిర్చినట్లు న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు యస్ రవికుమార్, వి శ్రీనివాస్, వెంకట హైమ పూజిత, ఉదయ్‌నాయక్, ఏపీపీలు రెచ్చల్ సంజాన జాషువ, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. అలాగే, అలంపూర్ కోర్టు ఆవరణలో జరిగిన ప్రత్యేక లోక్‌అదాలత్‌లో 36 కేసులు పరిష్కరించారు.
జాతీయ సాహస శిక్షణ శిబిరానికి ఎంపిక
గద్వాలటౌన్: ఈ నెల 18 నుంచి 27వ తేది వరకు హిమచల్ ప్రదేశ్ ధర్మశాలలోని అటల్ బిహారి వాజ్‌పేయి ఇనిస్టిట్యూట్‌లో జరిగే జాతీయ సాహస శిక్షణ శిబిరానికి ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి వీరేష్‌నాయక్ ఎంపికయ్యారు. ఈ విద్యార్థి బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 విభాగం నుంచి ఎంపికయ్యాడు. ఇదే శిక్షణ శిబిరానికి ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–2 విభాగానికి చెందిన పోగ్రాం ఆఫీసర్ భాస్కర్ సైతం ఎంపికయ్యారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పోగ్రాం ఆఫీసర్లలో భాస్కర్ ఒక్కరే ఎంపిక కావడం విశేషం. 2025–26 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ కళాశాల నుంచి పోగ్రాం ఆఫీసర్‌తో పాటు విద్యార్థి జాతీయ సాహస శిక్షణ శిబిరానికి ఎంపిక కావడం కళాశాలకే గర్వకారణమని ప్రిన్సిపల్ షేక్ కలందర్‌బాషా పేర్కొన్నారు.
ఆరోగ్య భద్రత కోసమే మెడికల్ క్యాంప్
ఎర్రవల్లి: ఆరోగ్య భద్రత కోసమే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు బీచుపల్లి పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బీచుపల్లి పదో బెటాలియన్‌లో హైదరాబాద్ రినోవా ఆసుపత్రి ఆద్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ హాజరై వైద్యులతో కలిసి మెగా మెడికల్ క్యాంపును ప్రారంబించారు. ఈమేరకు కార్డియాలజిస్ట్, యూరాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ఆంకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ వంటి విభాగాలకు చెందిన ఏడుగురు వైద్యులు 250 మంది బెటాలియన్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం కమాండెంట్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఆరోగ్యంతో పాటు సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్‌లు శ్రీనివాసులు, పాణి, వైద్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.


