ఎన్నాళ్లీ నిరీక్షణ..!
ఉన్నతాధికారుల
దృష్టికి తీసుకెళ్తాం
776 వర్క్‌షెడ్లకు 25 పూర్తి
●
రాజోళి: ఏళ్లు గడుస్తున్నా.. వరదలు మిగిల్చిన గాయం మానడంలేదు. 2009లో తుంగభద్ర నదికి వచ్చిన వరదల కారణంగా నదీ పరివాహక గ్రామాలన్నీ ముంపునకు గురయ్యాయి. చేనేత రంగంలో ఎంతో ఖ్యాతి గడించిన జోగుళాంబ గద్వాల జిల్లాలో చేనేత వృత్తిపై ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. గద్వాల పట్టణంతో పాటు గట్టు, అయిజ, మండలాల్లో కూడా చేనేత కార్మికులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అయితే ప్రధానంగా రాజోళి, అయిజ మండలాలే ముంపునకు గురయ్యాయి. ఈ మండలాల్లో చేనేత కార్మికులు అదే వృత్తిపై ఆధారపడి వేల సంఖ్యలో జీవనం సాగిస్తున్నారు. గతంలో వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి, ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అయితే ఈ గృహాలు మరీ చిన్నవిగా ఉండటంతో అందులో చేనేత కార్మికులు మగ్గం ఏర్పాటు చేసుకునేందుకు వీలుకాకపోవడంతో, చేనేత కార్మికుల వినతి మేరకు ప్రభుత్వం వర్క్ షెడ్లు కూడా నిర్మించేందుకు అంగీకరించింది. కానీ ఇప్పటిదాకా వర్క్ షెడ్ల ఊసే లేకపోవడంతో చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భారీ వర్షాల నేపథ్యంలో ఇరుకు గృహాల్లో మగ్గం గుంతల్లోకి నీరు చేరి నేత పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది.
వర్షాలతో తీవ్ర ఇబ్బందులు
చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు చిన్న ఇళ్లు ఉన్నప్పటికీ మగ్గం ఏర్పాటు చేసుకోక తప్పడం లేదు. ఉన్న చిన్న ఇంటిలోనే గుంత మగ్గాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉన్న రెండు గదుల ఇంటిలో ఒక గది మగ్గానికే సరిపోతుంటే, మరో గదిలోనే కుటంబ సభ్యులతో కాలం వవెల్లదీస్తున్నామని వాపోతున్నారు. ఇళ్లన్నీ నల్లమట్టి భూమిలో నిర్మించడం వలన ఈ వర్షాకాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు మగ్గం గుంతలోకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో నీటి ఊట రావడంతో మగ్గం గుంత నిండిపోతుంది. మెటీరియల్ నష్టపోవడమే కాకుండా, గుంతలోని నీరు ఎత్తిపోసుకోవడానికి సమయం వృథా అవుతుందని, గుంతలో నీరు ఎత్తిపోసుకోవడానికి నాలుగు రోజులు సమయం పట్టడంతో పాటు, తడిసిన మగ్గాలు ఆరే వరకు బట్టలు నేయడం కుదరదని వాపోతున్నారు. దీంతో నష్టాలు తప్పడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, ఒక్కో వర్క్ షెడ్‌కు రూ.45 వేల నుంచి రూ.60 వేల దాకా ఖర్చు పెట్టి నిర్మించేందుకు 2009లో అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది. ఇళ్ల నిర్మాణ సమయంలో ఇళ్లతో పాటుగానే వర్క్ షెడ్లు నిర్మిచాలని చేనేత కార్మికులు కోరినప్పటికీ, అధి ముందుకు సాగలేదు. కొందరు చేనేత కార్మికులకు వర్క్ షెడ్లు మంజూరు అయినప్పటికీ వాటి నిర్మాణం కూడా మధ్యలోనే నిలిచిపోయింది. ఇలా ఏళ్లుగా ప్రభుత్వాలు మారిన, ప్రత్యేక రాష్ట్రం, జిల్లా ఏర్పడినా.. తమ సమస్య తీరడం లేదని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
ఇరుకు గృహాల్లో మగ్గాల ఏర్పాటుకు ఇబ్బందులు
భారీ వర్షాల నేపథ్యంలో మగ్గం
గుంతల్లో చేరుతున్న నీరు
ఎప్పటికప్పుడు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. వివిధ స్కీంల ద్వారా వచ్చే ప్రయోజనాలను తెలియచేస్తున్నాం. వర్క్ షెడ్ల విషయానికి వస్తే గతంలో హౌసింగ్ శాఖ ద్వారా షెడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాగా.. ఆ శాఖ లేకపోవడంతో నిర్మాణాలు నిలిచాయి. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. వాటిని మంజూరు చేసేందుకు కృషి చేస్తాం.
– గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళి శాఖ
జిల్లాలో 6,948 మంది చేనేత కార్మికులు ఉండగా.. జియో ట్యాగింగ్ లేని వారితో లెక్కిస్తే మరింత ఎక్కవ సంఖ్యలో ఉంటారు. అందులో సింహభాగం రాజోళిలోనే ఉన్నారు. వీరిలో చాలా మందికి పునరావాసంలో ఇళ్ల కేటాయింపు జరిగింది. మరికొందరికీ అసలు ఇళ్లే మంజూరు కాలేదు. ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. కాలక్రమంలో కొద్దికాలం పాటు హౌసింగ్ శాఖ లేకపోవడంతో ఇటు ఇళ్ల నిర్మాణం, అటు వర్క్ షెడ్ల నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో రాజోళిలో మొత్తం 776 వర్క్ షెడ్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు 25 మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయి. ఇందులో కొందరు సొంతంగా వర్క్ షెడ్లు నిర్మించుకోగా, మరి కొందరు స్థోమత లేక నిర్మించుకోలేదు. మరి కొందరు మధ్యలోనే నిలిపేశారు. నిర్మించుకున్న వారికి ఇంతవరకు బిల్లులు కూడా అందలేదు.
ఎన్నాళ్లీ నిరీక్షణ..!


