వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
గద్వాలటౌన్: ఆధ్యాత్మిక వెలుగులతో ఆ ప్రాంతమంతా నిండింది.. శివనామస్మరణంతో మార్మోగింది.. పరమశువుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో చేపట్టిన దీపోత్సవ కార్యక్రమాలు కనులపండువగా సాగాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు భక్తులతో కోలాహాలంగా కనిపించాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే ఆయా ఆలయాలలో భక్తులు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. నదిఅగ్రహారంలోని ఆలయాల దగ్గర, స్థానిక తెలుగుపేటలోని శివాలయంలో పెద్ద సంఖ్యలో మహిళలు చేరి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. నది అగ్రహారం ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. స్థానిక కోటలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో, పెద్ద అగ్రహారంలోని అహోబిల మఠంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దీపాలు వెలిగించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి, మార్కండేయ స్వామి, అంబాభవాని ఆలయంలో, షిర్డిసాయి మందిరం, వీరభద్రస్వామి, రాఘవేంద్రకాలనీలోని శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. దీపాలతో ఆలయ ప్రాంగణాలు ప్రకాశవంతంగా మారాయి. వివిధ ఆకృతులలో వెలిగించిన ప్రమిదలు ఆకట్టుకున్నాయి. జములమ్మ ఆలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్‌లో కార్తీక దీపోత్సవ పూజలో పాల్గొన్నారు. నందికోల సేవ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించింది.
భక్తిశ్రద్ధలతో అభిషేకాలు
నీలకంఠాయ.. మృత్యుంజయాయ..సర్వేశ్వరాయ.. సదాశివాయ..శ్రీమాన్ మహాదేవయాయ నమః అంటూ పరమేశ్వరుడికి పండితులు వివిధ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకాలను భక్తిశ్రద్ధలతో తిలకించి భక్తులు తరించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శివాలయాలతో పాటు గ్రామాలలో ఉన్న శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. నదీ అగ్రహారం దగ్గర ఉన్న కృష్ణానదిలో తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో మహిళలు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అక్కడే కార్తీక దీపాలు వెలిగించారు.
వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు


