సామూహిక వివాహాలతో.. ఆదర్శ సమాజానికి బాటలు
బల్మూర్: ఆదివాసీల సామూహిక వివాహాలు ఆదర్శ సమాజానికి బాటలు వేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హాల్‌లో 111 చెంచు గిరిజన జంటలకు సామూహిక వివాహ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి మాధవిలత హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలోని ఆదివాసీల జీవన విధానం భిన్నమైనదని.. ఆర్థికంగా, సామాజికంగా వెనకబాటుకు గురైన చెంచు గిరిజనులకు వివాహ బంధం విశిష్టతను ఇలాంటి కార్యక్రమాలతో తెలుసుకొని అభివృద్ధి దిశగా నడిచేందుకు దోహదం చేస్తాయన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నల్లమలలోని చెంచు గిరిజనుల సామూహిక వివాహ మహోత్సవం కనులపండువగా జరిగిందని, వారిని ఆశీర్వదించడానికి రాష్ట్ర గవర్నర్ రావడం శుభసూచికమని అన్నారు. నూతన జంటలు కలకాలం ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. హైకోర్టు న్యాయమూర్తి మాధవిలత మాట్లాడుతూ తాను నల్లమల ప్రాంతంలోని పదర మండలం ఉడిమిళ్లకు చెందిన కోడలినని.. ఆదివాసీల జీవితాలు, వారి జీవన విధానాల మెరుగుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. వనవాసీ కల్యాణ పరిషత్ వారు చెంచు గిరిజన జంటలకు సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, శ్రీఆదిత్య పరాశ్రీ స్వామీజీ, రేఖానాగర్ వనవాసీ కల్యాణ ఆశ్రమం భారత కార్యకారిణి సభ్యులు ఇండోర్, తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కాట్రాజు వెంకటయ్య, జిల్లా అధ్యక్షుడు ఉడుతనూరి లింగయ్య, మహిళా ప్రముఖ్ గుర్రం శంకులత, జిల్లా ప్రముఖ్ భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సామూహిక వివాహాలతో.. ఆదర్శ సమాజానికి బాటలు


