లక్కు.. దక్కేదెవరికో!
● ఉమ్మడి జిల్లాలో 227 మద్యం దుకాణాలకు 5,536 దరఖాస్తులు
● నేడు కలెక్టరేట్లలో లక్కీడిప్ ద్వారా కేటాయింపు
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు నూతన లైసెన్స్‌దారులుగా ఎంపిక కానున్న అదృష్టవంతులు ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. మొత్తం 227 దుకాణాలకు కలిపి 5,536 మంది టెండర్లు దాఖలు చేయగా.. వీరిలో 227 మందిని లక్కీడిప్ ద్వారా ఎంపిక చేయనున్నారు. మిగిలిన 5,309 మంది నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు ఉమ్మడి జిల్లాలోని ఆయా కలెక్టరేట్లలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎకై ్సజ్ శాఖ అధికారులు కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేశారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన మద్యం దుకాణాలకు మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో లక్కీడిప్ నిర్వహించనున్నారు. కలెక్టర్ విజయేందిర మొత్తం 90 దుకాణాలకు లక్కీడిప్ ద్వారా నంబర్ కలిగిన ప్లాస్టిక్ కాయిన్ తీయగా సదరు కాయిన్‌పై ఉన్న నంబర్ దరఖాస్తుదారుడికి దుకాణం కేటాయిస్తారు. లక్కీడిప్‌నకు వచ్చే వారికి సెల్‌ఫోన్ అనుమతి ఇవ్వలేదు. తప్పక ఎంట్రీపాస్‌తో లోపలికి రావాల్సి ఉంటుంది. ఒక్కో దుకాణానికి ఒక్కరికి మాత్రమే లోపలికి వెళ్లడానికి అవకాశం కల్పించారు.
జిల్లా దుకాణాలు టెండర్లు
మహబూబ్‌నగర్ 54 1,634
నాగర్‌కర్నూల్ 67 1,518
నారాయణపేట 36 853
గద్వాల 34 774
వనపర్తి 36 757
జిల్లాల వారీగా వచ్చిన టెండర్లు ఇలా..


