కృష్ణమ్మ ఒడిలో.. జలవిహారం
సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి ఏర్పాట్లు
● వరదలతో రెండు నెలలుగావాయిదా పడిన వైనం
● తాజాగా తగ్గుముఖం పట్టడంతో ప్రారంభించేందుకు కసరత్తు
● పర్యాటకులకు మెరుగైన వసతుల కల్పనకు చర్యలు
● బ్యాక్‌వాటర్‌లో ఆకట్టుకుంటున్నచిన్నబోట్ల షికారు
సరిహద్దు సమస్యతో..
కృష్ణానదిలో లాంచీ ప్రయాణాలకు రాష్ట్రాల సరిహద్దు సమస్య కొంత ఇబ్బందిగా మారింది. సోమశిల నుంచి శ్రీశైలానికి తిప్పే లాంచీని మొదట్లో పాతాళగంగ వద్ద ఆపేవారు. ఏపీ అధికారులు అభ్యంతరం చెప్పడంతో ఈగలపెంట వద్ద ఆపుతున్నారు. అక్కడి నుంచి పర్యాటకులు బస్సులు, ఇతర వాహనాల్లో శ్రీశైలానికి వెళ్లి వస్తున్నారు. ఇందుకు దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. పాతాళగంగ వద్ద లాంచీని ఆపితే ప్రయాణికులకు సమయం ఆదా కావడంతోపాటు అలసట కూడా ఉండదనే విషయాన్ని పలువురు పర్యాటక శాఖ అధికారులతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశం మంత్రి పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు.
ప్రయాణాల్లో మార్పులు
సోమశిల నుంచి శ్రీశైలానికి నడిపే ఏసీ లాంచీలో గతేడాది కొన్ని రకాల మార్పులు చేశారు. గతంలో 60 నుంచి 70 మంది ప్రయాణికులు బుకింగ్ చేసుకుంటేనే లాంచీ ప్రయాణం చేపట్టేవారు. అయితే ఒకేసారి అంతమంది బుకింగ్ చేసుకోవడం సమస్యగా మారింది. దీంతో ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా ఈ లాంచీ ప్రయాణం కొనసాగేది కాదు. గతేడాది ప్రతి శని, ఆది వారం ప్రయాణికులు ఉన్నా.. లేకున్నా.. లాంచీని తిప్పాలని టూరిజం శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకులు ఆయా రోజుల్లో లాంచీ ప్రయాణాలకు మొగ్గుచూపడంతో ఇదే పద్ధతిని కొనసాగించాలని భావిస్తున్నారు. టికెట్ల ధరలు, వసతుల కల్పనలోనూ ఈ ఏడాది నుంచి మార్పులు చేపట్టాలని నిర్ణయించారు.
మరిన్ని కొత్త బోట్లు..
సోమశిల నుంచి శ్రీశైలానికి తిప్పేందుకు 30 నుంచి 40 మంది వరకు ప్రయాణించేందుకు వీలుగా మరో కొత్త ఏసీ లాంచీని ఏర్పాటు చేసే యోచనలో పర్యాటక శాఖ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఏసీ లాంచీ నిర్వహణకు భారీగా ఖర్చవుతోంది. ప్రయాణికుల సంఖ్య 50లోపే ఉంటుండడంతో నిర్వహణ భారం తగ్గాలంటే మరో చిన్న లాంచీని ఏర్పాటు చేయడమే మేలని భావిస్తున్నారు. సోమశిలలో వీఐపీ ఘాట్ వద్ద పరిసర ప్రాంతాల్లో విహరించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్వాన్ బోట్, పెడల్ బోట్, కయాక్ బోట్, వాటర్ సింప్లీ సోర్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో జెట్‌స్కీ బోట్, బైక్ బోట్, ఫనియాక్ బోట్లు ఏర్పాటు చేశారు. వీటిలో షికారు చేసేందుకు ప్రయాణికులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్థానికంగా విహారానికి మరికొన్ని చిన్న బోట్లను ఏర్పాటు చేసేందుకు కూడా పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది.
పెద్దలకు పిల్లలకు
సోమశిల నుంచి శ్రీశైలం 2,000 2,000
వన్ వే ప్రయాణం
సోమశిలలో తిరిగేందుకు 100 50
మినీ లాంచీకి
కయాకి బోట్ (ఒక వ్యక్తికి) 150
స్పీడ్ బోట్ (నలుగురు వ్యక్తులకు) 400
పెడల్ బోట్
(ఒక వ్యక్తికి) 100
వసతులు కల్పిస్తున్నాం..
వరదల కారణంగా సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. త్వరలోనే లాంచీ ప్రయాణాలు ప్రారంభిస్తాం. తక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తే పెద్ద లాంచీలో నది ప్రయాణం చేయడం వల్ల నిర్వహణ భారం పెరుగుతోంది. దీన్ని తగ్గించేందుకు చిన్న లాంచీ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరాం. సోమశిల పరిసర ప్రాంతాల్లో షికారు చేసేందుకు మరికొన్ని చిన్న బోట్లు కూడా తేవాలనుకుంటున్నాం. మంత్రి ఆదేశానుసారం పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నాం.
– నర్సింహ, జిల్లా పర్యాటక శాఖ అధికారి
అందుబాటులో రెండు లాంచీలు
నల్లమల కొండల మధ్యలో ప్రవహించే కృష్ణానది అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకొని టూరిజం అధికారులు పదేళ్ల క్రితం సోమశిలలో 30 మంది వరకు ప్రయాణించేందుకు వీలుగా నాన్ ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు. లాంచీ ప్రయాణానికి పర్యాటకులు ఆసక్తి చూపడంతో 2019లో స్వదేశీ దర్శన్ నిధులు రూ.2.50 కోట్లు వెచ్చించి.. 120 మంది ప్రయాణించేందుకు వీలుగా ఏసీ లాంచీని సైతం ఏర్పాటు చేశారు. మినీ లాంచీని సోమశిల పరిసరాల్లో మాత్రమే తిప్పుతూ.. ఏసీ లాంచీని శ్రీశైలం వరకు నడిపిస్తున్నారు.


