నేడు ఎస్‌జీఎఫ్ క్రీడా జట్ల ఎంపిక
గద్వాల: ఈనెల 26వ తేదీన ఆదివారం 69వ ఎస్‌జీఎఫ్ అండర్–14, అండర్–17 బాలుర, బాలికల జిల్లా ఫుట్‌బాల్ జట్టు ఎంపిక చేస్తామని ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ టి.శ్రీనివాసులు ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని స్థానిక ఇండోర్ స్టేడియంలో ఎంపిక నిర్వహిస్తామని అండర్–14లో 01.01 2012 సంవత్సరంలో జన్మించిన వారు అర్హులని, అండర్–17కి 01.01.2009 సంవత్సరంలో జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఈ ఎంపికలో పాల్గొనబోయే ప్రతివిద్యార్థి తప్పకుండా సంబంధిత పాఠశాల బోనఫైడ్, ఆధార్‌కార్డుని తీసుకురావాలని తెలిపారు. ప్రతిస్కూల్ నుంచి అండర్–14,17 విభాగాల్లో ముగ్గురు లేక, నలుగురు బాల,బాలికలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంపిక అనంతరం రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ నవంబర్ 3వ తేదీన, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల జోనల్ టోర్నమెంట్స్ ఉన్నందున ఈ ఎంపిక ప్రక్రియను అత్యవసరంగా నిర్వహిస్తున్నట్లు అందరు పీఈటీలు, పీడీలు సహకరించాలని ఆయన కోరారు.
ఆదిశిలా క్షేత్రంలోప్రత్యేక పూజలు
మల్దకల్ : ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అరవిందరావు, బాబురావు, చంద్రశేఖర్‌రావు, ఆలయ సిబ్బంది రంగనాథ్, శ్రీను, చక్రి, రాములు, కృష్ణ, శివమ్మ, వాల్మీకీ పూజారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా, సద్దలోనిపల్లి కృష్ణస్వామి, అమరవాయి వీరభద్రస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్ప, శేషంపల్లి శివసీతారామస్వామి ఆలయాల్లో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అలుగును ధ్వంసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి
గట్టు: మండలంలోని పెంచికలపాడు గ్రామ శివారులోని పల్లెవాని చెరువు అలుగును కొందరు ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలంలో కురిసిన వర్షాలకు పల్లెవాని చెరువు నిండి అలుగు పారుతున్నట్లు తెలిపారు. అయితే చెరువు పైభాగంలో ఉన్న కొంత మంది రైతులు తమ పంట పొలాలు నీట మునుగుతాయనే ఉద్దేశంతో చెరువు అలుగును ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేసినట్లు గ్రామానికి చెందిన మరికొంత మంది రైతులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ధ్వంసం చేసిన చెరువు అలుగు కారణంగా చెరువులోని చాలా వరకు నీరు వృథాగా కిందకు పారుతోందని, ఉద్దేశ పూర్వకంగానే జేసీబీ సహాయంతో చెరువు అలుగును ధ్వంసం చేసినట్లు పెంచికలపాడు గ్రామస్తులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించి, బాద్యులపై చర్యలు తీసుకోవాలని పెంచికలపాడు గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.


