వైద్యులను నియమించండి
అలంపూర్: వంద పడకల ఆస్పత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. హైదరాబాద్‌లో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్‌ను ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే శనివారం కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చే వారికి వసతులు కల్పించాలని, వైద్యాధికారులను నియమించాలని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాల నుంచి వైద్యం కోసం వచ్చే వారికి వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రజల అవసరాలను గుర్తించి మౌళిక వసతులు కల్పించాలని వినతిలో కోరారు. అదేవిధంగా సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్‌డీ వేముల శ్రీనివాస్, విపత్తుల నిర్వహణ అధికారులను కలిసి బాధితులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలం భూంపురం, రాజోలి మండలం ముండ్లదీన్నేతోపాటు ఆయా గ్రామాల్లో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందినట్లు వినతిలో పేర్కొన్నారు. పిడుగుపాటుతో మృతి చెందిన కుటుంబాలకు రూ. 6 లక్షల ఆర్థిక సాయంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. వీరితోపాటు నాయకులు తదితరులు ఉన్నారు.


