పత్తి కొనుగోళ్లను సరళీకృతం చేయాలి
గద్వాల వ్యవసాయం: పత్తి కొనుగోళ్లకు ప్రవేశపెట్టిన కపాస్ యాప్ విధానాన్ని రద్దు చేసి, గతంలో మాదిరి కొనుగోళ్లను సరళీకృతం చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలాజీ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని రైతుల్లో ఇంకా సాంకేతికత పెరగలేదని, కపాస్ కిసాన్ యాప్ ప్రక్రియ రైతులకు ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకొచ్చే రైతులు ఈ యాప్‌లో ఆన్‌లైన్ చేసుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి పాత విధానాన్ని అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. పత్తి కొనుగోళ్లు కూడా ఈసారి చాలా ఆలస్యంగా ప్రారంభించారని, 8–12తేమ శాతం ఉంటేనే కొంటామనడం సరికాదన్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అంత తక్కువ తేమ శాతం ఉండదని, ప్రభుత్వాలు ఏపని తలపెట్టిన రైతులకు మేలు చేసే విదంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్ చైర్మన్ కురువ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్ప, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీలు రాజారెడ్డి, విజయ్‌కుమార్, ప్రతాప్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


