
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
అలంపూర్: హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ అన్నారు. అలంపూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించడంతోపాటు.. భోజనం, శుభ్రత, భద్రతా చర్యలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. లక్ష్యం ఎంచుకొని కష్టపడి చదవాలని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సూచించారు. వీరితోపాటు బార్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, సీనియర్ న్యాయవాదులు తిమ్మారెడ్డి, సురేష్ కుమార్, న్యాయవాదులు వెంకటేష్, భీమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ టెండర్లపై రగడ
అలంపూర్: అలంపూర్ జోగుళాంబ ఆలయాల టెండర్లపై రగడ కొనసాగుతుంది. ఆలయాలకు సంబంధించి గతంలో పలు టెండర్లను నిర్వహించగా.. వివిధ కారణాలతో అందులో కొన్నింటిని దేవాదాయ శాఖ అధికారులు రద్దు చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా కొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఓ దళిత మహిళకు టెండర్ దక్కడంతో.. ఈమేరకు రద్దు చేసినట్లు దళిత సంఘాలు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. పనిలో పనిగా ఉత్సవాల పేరిట భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఆలయ ఈఓను ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. అయితే, ఈ అంశంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి
మల్దకల్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి హృదయరాజు సూచించారు. బుధవారం మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు అన్నిరంగాలలో రాణించి కళాశాలకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ప్రతి విద్యార్థికి ఇంటర్‌విద్య చాలా కీలకమైనదని, భవిష్యత్‌కు పునాది లాంటిదని, బాగా చదివి ప్రతిభ కనబర్చిన వారికి స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటాయన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపల్ కృష్ణ, అధ్యాపకులు నర్సింహులు, రామాంజనేయులుగౌడ్, గోవర్దన్ శెట్టి, భాగ్యలక్ష్మి, మాధురి, రాఘవేంద్ర, శ్రీకాంత్, రంగస్వామి, నీలవేణి పాల్గొన్నారు.
మిగిలింది 24 గంటలే
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలోని మద్యం దుకాణాలకు టెండర్ల స్వీకరణకు కేవలం 24గంటల సమయం మాత్రమే మిగిలింది. ప్రభుత్వం మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు మరోసారి అవకాశం కల్పించినా వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బుధవారం ఉమ్మడి జిల్లాలో 42 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. గతంలో వచ్చిన టెండర్ల కంటే ఈ సారి పెంచాలని ఎకై ్సజ్ అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇక ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 ఏ–4 దుకాణాలకు 5,230 దరఖాస్తులు వచ్చాయి. గురువారం చివరి రోజు కావడంతో మరో 500 నుంచి 1000 టెండర్లు దాఖలు కావొచ్చని ఎకై ్సజ్ అధికారులు ఆశిస్తున్నారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి