
కంప్యూటర్ విద్యతో బంగారు భవిష్యత్
ఇటిక్యాల: పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందిస్తే వారి బంగారు భవిష్యత్‌కు దారులు వేసినట్లేనని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయ ణ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దదిన్నె ప్రాథమికోన్నత పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సంస్థ మేనేజర్ వెంకటేశ్వర్లు సహకారంతో రూ.1.50 లక్షలతో కమ్యూనిటీ ప్యూరిఫై వాటర్ ప్లాంట్, గ్రామానికి చెందిన తిరుమల్‌రెడ్డి కుటుంబ సహకారంతో రూ.1,50 లక్షల విలువ గల కంప్యూటర్ ల్యాబ్, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి కంప్యూటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రతి విద్యార్ధి క్రమశిక్షణ కలిగి విద్యను అభ్యసించాలని, క్రమశిక్షణ లేని విద్య వ్యర్థమని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీర భద్రప్ప, ఎంఈఓ వెంకటేశ్వర్లు, కాంప్లెక్స్ జిహెచ్‌ఎం పాగుంటన్న, హెచ్‌ఎం కరేంద్రనాధ్ పాల్గొన్నారు.