‘చేయి’ తడపాల్సిందే..! | - | Sakshi
Sakshi News home page

‘చేయి’ తడపాల్సిందే..!

Oct 13 2025 8:32 AM | Updated on Oct 13 2025 8:32 AM

‘చేయి

‘చేయి’ తడపాల్సిందే..!

ఇసుక కాంట్రాక్టర్‌కు ‘అధికార’ పార్టీ నేత హుకుం

ఒక్కో టిప్పర్‌కు రూ.6 వేల చొప్పున డిమాండ్‌

పట్టించుకోకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నాయంటూ అడ్డంకులు

తుమ్మిళ్లలో 2 రోజులుగా నిలిచిన ఇసుక రవాణా

ఆందోళనలో లబ్ధిదారులు..సీఎం పేషీకి చేరిన ‘పంచాయితీ’

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక కొరత గుదిబండగా మారింది. ఈ విషయాన్ని గ్రహించిన సర్కారు తొలుత జోగుళాంబ గద్వాల, ఆ తర్వాత ఉమ్మడి పాలమూరులోని మిగతా జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లకు తుమ్మిళ్ల నుంచి ఉచితంగా ఇసుక అందజేసేలా కార్యాచరణ చేపట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఫలితం కానరావడం లేదు. నదిలో నీటి ప్రవాహం బాగా ఉంది.. అందుకే అధికారిక రీచ్‌లోనూ ఇసుక తవ్వకాలు చేపట్టలేకపోతున్నారని అనుకుంటే పొరపాటే. తొలుత వర్షాలతో.. తాజాగా ‘చేయి’ తడపాల్సిందేనంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి హుకుంతో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిచిపోయింది. ఫలితంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

అడుగడుగునా అడ్డంకులు..

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలోని రాజోళి మండలం తుమ్మిళ్లలో తుంగభద్ర నది నుంచి ఫ్లెడ్జింగ్‌ పద్ధతిన ఇసుక తోడి ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా అందజేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నదిలో నీరు ఉన్న సమయంలోనూ కార్గో శాండ్‌ బోట్స్‌ డ్రైజింగ్‌ మెకానిజం పద్ధతిన ఇసుక తవ్వేలా ఈ ఏడాది జూన్‌లో టెండర్లు నిర్వహించింది. మూడు పాయింట్ల ద్వారా వచ్చే ఏడాది జూన్‌ 21 వరకు 7.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక తీసేందుకు ఓ కాంట్రాక్టర్‌ ఒప్పందం కుదుర్చుకొని జూలై 3న తవ్వకాలు ప్రారంభించారు. లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న మేరకు.. అధికారులు సూచించిన రూట్‌ మ్యాప్‌ ప్రకారం తుమ్మిళ్ల నుంచే టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. అయితే తొలి నుంచీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సుమారు 7 వేల ఇళ్లకు ఇసుక అందించాల్సి ఉంది. 45 రోజుల క్రితం సరఫరా మొదలైనప్పటికీ.. ఇప్పటి వరకు 650 ఇళ్లకు మాత్రమే అందజేశారు. వర్షాలతో సరఫరాకు అడ్డంకులు ఏర్పడగా.. దాన్ని అధిగమించేలోపు మరోసారి బ్రేక్‌ పడింది.

డ్రైవర్ల ఆందోళన..

ఉన్నతాధికారులకు ఫిర్యాదు..

నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత డిమాండ్‌కు అంగీకరించని సదరు కాంట్రాక్టర్‌ నేరుగా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం పేషీకి పంచాయితీ చేరగా.. సీఎంఓ వర్గాలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పలువురు జిల్లా అధికారులతో ఫోన్‌లో సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే దీనిపై జిల్లా అధికారులెవరూ నోరు విప్పడం లేదు.

ఇసుక లోడ్‌తో వాహనాలు నిలిచిపోగా టైర్లు దెబ్బతింటున్నాయని.. రెండు రోజులుగా తిండి, నీరు లేక ఇబ్బంది పడుతున్నామంటూ డ్రైవర్లు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు యువకులు రీచ్‌ వద్దకు చేరుకుని గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఇసుకను కొల్లగొట్టారని ఉదహరించారు. అప్పుడు ఈ నాయకులు ఎక్కడికి వెళ్లారని.. అప్పుడు దెబ్బతిన్న రోడ్లు ఇప్పటిదాకా వేయకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అందిస్తే మంచిదేనని.. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. అనుమతులు ఉన్నా.. అధికార పార్టీ నాయకులు వారి స్వార్థం కోసం అడ్డుకుంటూ గ్రామం పేరు చెడగొడుతున్నారంటూ వాహనాలను పంపించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌గా మారగా.. ‘అధికార’ నేత నిర్వాకం చర్చనీయాంశమైంది.

‘చేయి’ తడపాల్సిందే..! 1
1/2

‘చేయి’ తడపాల్సిందే..!

‘చేయి’ తడపాల్సిందే..! 2
2/2

‘చేయి’ తడపాల్సిందే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement