
కోటి వెలుగుల దీపావళి
గద్వాలటౌన్: దీపాన్ని జ్ఞానానికి, సంతోషానికి, నిర్మలత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు. అలాంటి దీపం ప్రాముఖ్యత తెలిపే విధంగా ఏర్పాటు చేసిందే ఈ దీపావళి పర్వదినం. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళి వస్తుంది. సోమవారం జిల్లాలో ప్రజలు సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహించుకోనున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. వెలిగించిన దీపాలు స్వర్గానికి దారి చూపిస్తాయని విశ్వసిస్తారు. దీపావళి రోజు దీపాలు వెలిగిస్తే దేవతలు కరుణిస్తారని హిందువులు నమ్ముతారు. అందుకే ప్రతి ఇంట్లో దీపాల వరుసలు కనిపిస్తూ శుభసంకేతాలు ప్రసరిస్తాయి. దీపావళిని కొన్ని ప్రాంతాల్లో మూడు, మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ఈ పండుగ నిర్వహిస్తారు.
దీపపు ప్రమిదలు ప్రత్యేకం..
అమావాస్య చీకటిని సైతం లెక్కచేయకుండా కాంతులీనడానికి ఇంటింటా సమాహారమయ్యే దీపపు కుందెలు, ప్రమిదలు దీపావళి పండగలో ముఖ్య భూమికను పోషిస్తుంటాయి. శుభానికి చిరునామాగా పసుపు, పారాణి అలంకరణతో ముస్తాబైన ఇంటి గడప, ప్రహరి, ప్రాంగణం, వాకిళ్లలో ఒక్కొక్కటిగా జతయ్యి... పసిడికాంతుల్ని నింపుతూ భారతీయ సాంప్రదాయాన్ని ఆవిష్కరించే ప్రమిదల కొలువు దీపావళి వేడుకల్లో చూసి తీరాల్సిందే. ఈ ప్రత్యేకతను పురస్కరించుకొని స్థానికంగా కొంత మంది వ్యాపారులు వివిధ రూపాల్లో రూపొందించిన ప్రమిదలను హైదరాబాద్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల నుంచి మట్టి, సిరామిక్ దీపాలను గద్వాలకు తీసుకవచ్చి విక్రయిస్తున్నారు. డిజైన్‌ను బట్టి జత రూ.30 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో ప్రమిదలు కొలువుదీరాయి.
మార్కెట్లు కిటకిట
దీపావళి పండుగ సందర్భంగా అన్ని మార్కెట్లు సందడిగా కనిపిస్తున్నాయి. కొనుగోలుదారులతో వస్త్ర దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. బంతిపూలు, లక్ష్మీదేవి చిత్రపటాలు, గౌరీనోముల దండలు, చాటల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీపావళి సందర్బంగా స్మార్ట్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు, ఇతర గృహావసరాల వస్తువులు వివిధ ఆఫర్లతో అమ్మకాలు ఊపందుకున్నాయి.
దీపాలు వెలిగిస్తే శుభం
దీపావళి పండగకు దీప తోరణాలు వెలిగించే ఆచారం ఉంది. ఆరోజు శ్రీ మహాలక్ష్మిదేవి భూలోకానికి వచ్చి ఇంటింటికీ తిరుగుతుందని నమ్మకం. అందుకే ప్రజలు లక్ష్మిదేవికి నీరాజనాలు పలుకుతూ తమ ఇంట్లో, బయట దీపాలు వెలిగిస్తారు. దీపాల వరుసను వృత్తాకారంలో, స్వస్తిక్ ఆకారంలోనూ పేర్చి వెలిగిస్తే మరింత మంచిది. – రేణుక, గద్వాల
చెడుపై గెలిచిన మంచికి ప్రతీకగా సంబరాలు
వైవిధ్య రూపాల్లో
ఆకట్టుకుంటున్న ప్రమిదలు
బాణసంచా దుకాణాల్లో రద్దీ.. పెరిగిన ధరలతో కొంత అసహనం
నేడు జిల్లావ్యాప్తంగా వేడుకలు

కోటి వెలుగుల దీపావళి

కోటి వెలుగుల దీపావళి