
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: జిల్లాలో మత్తు పదార్థాల వ్యసన నివారణ కేంద్రం (డీఅడిక్షన్ సెంటర్) ఏర్పాటు చేయుటకు అర్హత గల స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి సునంద శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ రవాణాకు అనుకూలంగా ఉంటూ పునరావాసం, చికిత్స, సమావేశం మొదలైన వసతులు కలిగిన 333 గజాల సొంత లేదా ఉచిత భవన సౌకర్యాలు ఉండాలని తెలిపారు. ఆసక్తి గల సంస్థలు eanudaan(grants-msje.gov.in)పోర్టల్ నందు దరఖాస్తు చేసుకోవాలని జూన్ 30 నుంచి జూలై 31 తేదీ వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. దరఖాస్తుతో పాటు ధ్రువపత్రాలను జతపర్చి జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో రూం నంబర్ 33లో సమర్పించాలని పేర్కొన్నారు.
ఆర్టీసీలో అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని వివిధ ఆర్టీసీ డిపోలలో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ విభాగాల్లో మూడేళ్ల అప్రెంటిస్ శిక్షణకు ఆసక్తి గల ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్‌ఎం సంతోష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేటకు చెందిన వారు గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్ ఇన్ ఐటీ/ కంప్యూటర్ సైన్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ/ గణితం కోర్సులలో లేదా డిప్లొమా 2021 నుంచి పాసై ఉండాలన్నారు. ఇక నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌కు బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. దరఖాస్తులను నాట్స్ (నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీం) httpr://natr. education.gov.in వెబ్‌పోర్టల్‌లో ఈ నెల 21 నుంచి 27 వరకు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, శిక్షణ కాలంలో ప్రతినెలా స్టైఫండ్ ఇస్తామని తెలిపారు.
23 నుంచి నిరంతర వైద్య సేవలు
అలంపూర్: అలంపూర్ చౌరస్తాలోని 100 పడకల ఆసుపత్రిని ఈ నెల 23 నుంచి 24 గంటల నిరంతర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వైద్య విధాన పరిషత్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ రమేష్‌చంద్ర అన్నారు. శనివారం 100 పడకల ఆసుపత్రిని పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అత్యవసర సర్జరీలకు సంబంధించి వైద్యం ఓపి ప్రారంభమైన మరో వారం రోజుల తర్వాత అందుతాయని పేర్కొన్నారు. ఆసుపత్రిలో జరిగే వివిధ అభివృద్ధి, మరమ్మతు పనులను పరిశీలించారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. డా.అమీర్, సిబ్బంది పాల్గొన్నారు.
గెస్ట్ లెక్చరర్ల భర్తీకి చర్యలు
బిజినేపల్లి: పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్)లో 2025– 26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ విద్యార్థులకు తరగతులు బోధించేందుకు ఆయా సబ్జెక్టుల్లో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, పొలిటికల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులకు గాను మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, సెల్ నం.9848466603ను సంప్రదించాలని కోరారు.