
వైఎస్సార్ సేవలు మరువలేనివి
గద్వాలటౌన్: దివంగత ముఖ్యమంత్రి.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు మరువలేనివని పలువురు నాయకులు కొనియాడారు. మంగళవారం వైఎస్సార్ జయంతిని గద్వాల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వివిధ కుల సంఘాల నాయకులు వేర్వురుగా పాతబస్టాండ్ చౌరస్తాలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే వర్గీయులు వేర్వేరుగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, మాజీ వైస్ చైర్మన్ శంకర్, సీనియర్ నాయకుడు నల్లారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్.రాజశేఖరరెడ్డి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచారని, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, రుణమాఫీ అమలు చేశారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని చెప్పారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన నాయకులు గడ్డం కృష్ణరెడ్డి, పటేల్ ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతుల కోసం జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన మహనీయుడు వైఎస్సార్ అని కొనియాడారు.

వైఎస్సార్ సేవలు మరువలేనివి