
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి
గద్వాలటౌన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజ్ అన్నారు. మంగళవారం స్థానిక ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జైనడిగడ్డ యువత ఆధ్వర్యంలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పుస్తకాలలో నేర్చుకునే విషయాలను నిజజీవితంలో ప్రయోగించి, సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్నారు. ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని, వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జైనడిగడ్డ యువత స్ఫూర్తిని ఆయన అభినందించారు. అనంతరం జిల్లాస్థాయిలో పది, ఇంటర్, డిగ్రీ పరీక్షలలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించి, ప్రతిభ పురస్కారాలను అందజేశారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ షేక్ కళాందర్ బాషా మాట్లాడుతూ యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, రామకృష్ణ, శ్రీనివాసులు, బీచుపల్లి, అంజి, వీరేష్, తిమ్మప్ప, రమేష్‌గౌడ్, నర్సింహులుగౌడ్, ఈరన్నగౌడ్, గట్టన్ననాయుడు పాల్గొన్నారు.