
గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
గద్వాల: శిక్షణా సమయంలో నేర్చుకున్న నైపుణ్యాలను పంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్(లోకల్‌బాడి)నర్సింగ్‌రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రతిగ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలంటే కార్యదర్శి ప్రజలతో మమేకమై బలమైన అనుబంధాన్ని నెలకొల్పి ముందుకు సాగాలన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామ స్థాయిలో జరుగుతున్న ప్రతికార్యక్రమం, ప్రజలకు అందాల్సిన సేవలు, అభివృద్ధి పనులు గ్రామ సభల ద్వారానే చర్చించబడాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హుల వరకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రతిపౌరుడికి ముఖ్యమైన సాధనం అన్నారు. ప్రజలెవరికై నా ప్రభుత్వ పనులు, పథకాల వివరాలు తెలుసుకునే హక్కుందన్నారు. గ్రామాల్లో అన్ని రంగాల్లో సమగర అభివృద్ధి సాధించేందుకు అన్నిశాఖలతో సమన్వయం చేసుకుంటూ ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్నారు. శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో డీపీవో నాగేంద్రం, మాస్టర్ ట్రైనర్ రిటైర్డ్ డీపీవో కృష్ణ, శిక్షణ రీజినల్ మేనేజర్ హనుమంతు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.