
చివరి ఆయకట్టు వరకు సాగునీరు
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ప్రతి ఎకరాకు, చివరి ఆయకట్టుకు సాగు నీరందించి కోనసీమను తలపించేలా గద్వాలను తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ర్యాలంపాడు రిజర్వాయర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కుడి, ఎడమ కాల్వలకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులనుద్దేశించి మాట్లాడారు. గత కొన్ని వారాలుగా ఎగువన కురిసిన వర్షాల ఆధారంగా జూరాలకు భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరాయని, దీంతో జూరాల కుడి, ఎడమ కాల్వలకు సాగు నీటిని విడుదల చేశామన్నారు. దీంతో పాటు ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌లను నింపే ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు. రిజర్వాయర్ల కింద ఉన్న పొలాలకు పూర్తి స్థాయిలో నీటిని అందించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి సాగు నీరందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, వీటితో పాటు అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని అన్నారు. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనడంతో పాటు రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ అందించారన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం రెండు పంటలకు సాగు నీరందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ హనుమంతు, జెడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్ విజయ్ కుమార్, రామన్న, శ్రీరాములు, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.