
మట్టి తరలింపుపై రహస్య విచారణ?
అలంపూర్: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గుట్టలను విజిలెన్స్ అధికారులు సోమవారం పరిశీలించారు. సహజ సిద్ధంగా వెలసిన గుట్టల నుంచి కొందరు అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్న విషయమై ‘గుట్టలు మాయం’ శీర్షికన ఈ నెల 7న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో విజిలెన్స్ అధికారులు స్పందించారు. అలంపూర్ మండలంలోని ర్యాలంపాడు, సుల్తానాపురం శివారులో ఉన్న గుట్టలను పరిశీలించినట్లు తెలిసింది. పత్రికలో వచ్చిన కథనాల మేరకు రాష్ట్ర అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం. అయితే ఈ విషయమై స్థానిక అధికారులు, మైనింగ్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. ఎవరికి వారు దాటవేసే ప్రయత్నం చేశారు. కనీసం అధికారులు వచ్చారా లేదా అనే విషయంపైన కూడా నిర్ధారణ చేయలేదు. విశ్వనీయ సమాచారం మేరకు రాష్ట్ర అధికారులు సమగ్ర సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక అధికారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో సమాచారం ఇచ్చే విషయంలో గోప్యంగా వ్యవరిస్తున్నారని చర్చ కొనసాగుతుంది.