కష్టంగా కాదు.. ఇష్టంతో చదవాలి
ఎర్రవల్లి: విద్యార్థులు చదువును కష్టంగా భావించకుండా.. ఇష్టంతో ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పదో పటాలం ఇన్‌చార్జి కమాండెంట్ జయరాజు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పదో పటాలం సాయుధ చైతన్య పాఠశాలలో ఏర్పాటుచేసిన వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి పాఠశాల, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని.. వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం గతేడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమోంటోలు అందించి అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పాణి, శ్రీనివాస్, ఎంఈఓ అమీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.


