సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
గద్వాల: గ్రామాల్లో నెలకొన్న వివిధ రకాల భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం గద్వాల మండలంలోని అనంతపురం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును కలెక్టర్ బీఎం సంతోష్ ఆకస్మికంగా సందర్శించి.. సదస్సులో వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అలాగే దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు రశీదులు ఇస్తున్నారా అని ఆరాతీశారు. భూ భారతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లి భూమి సంబంధిత సమస్యలు పరిష్కరిస్తారని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలు, తహసీల్దార్ మల్లికారుర్జున్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


