
జాతీయ రక్షణ నిధికి రూ.లక్ష విరాళం
గద్వాల: జాతీయ రక్షణ నిధికి రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోరంట్ల లక్ష్మీకాంతారెడ్డి రూ.1లక్ష విరాళం ఇచ్చినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా లక్ష్మీకాంతారెడ్డి కలెక్టర్‌ను కలిసి రైతుభరోసా పథకం ద్వారా జమ అయిన రూ.లక్షను జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందజేశారు. సేవాగుణం గొప్పదని ఇందుకు లక్ష్మీకాంతారెడ్డినే ఉదాహరణ అని, వీరి సేవలు మిగతావారికి స్ఫూర్తినిస్తాయని కలెక్టర్ అభినందించారు.
స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: 2024–25 విద్యాసంవత్సరానికిగాను పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సరోజ ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థినీ, విద్యార్థులు అర్హతను బట్టి పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు ఫ్రెష్, రెన్యూవల్ కోసం www.epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలి
మల్దకల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొన్న వరి ధాన్యాన్ని అధికారులు వెంటనే లారీల ద్వారా ప్రభుత్వ గోదాములకు తరలించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మల్దకల్‌లోని వరి కొనుగోలు కేంద్రానికి సమీపంలో ఉన్న అయిజ–గద్వాల రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రంలో తమ నుంచి కొన్న ధాన్యాన్ని అధికారులు పది రోజులు గడుస్తున్న గోదాములకు తరలించడంలేదని, వర్షాలకు ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యులని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో అయిజ–గద్వాల ప్రధాన రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న రైతుల వద్దకు చేరుకొని రైతులకు నచ్చచెప్పి ధర్నా విరమింప చేశారు. రెవెన్యూ, సివిల్ సప్లయి అధికారులు ప్రశాంత్‌గౌడ్, కిరణ్ మల్దకల్‌కు చేరుకొని రైతుల నుంచి కొన్న వరి ధాన్యాన్ని వెంటనే లారీల ద్వారా గోదాములకు తరలిస్తామని చెప్పారు.
వేరుశనగ క్వింటా రూ.5,602
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు సోమవారం 67 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 5602, కనిష్టం రూ. 2739, సరాసరి రూ. 4802 ధరలు పలికాయి. 29 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5839, కనిష్టం రూ. 4819, సరాసరి రూ. 5810 ధరలు లభించాయి. 270 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.1986, కనిష్టం రూ. 1575, సరాసరి రూ.1769 ధరలు వచ్చాయి. 10 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6425, కనిష్టం రూ. 2500, సరాసరి రూ. 6275 ధరలు పలికాయి.
ప్రశాంతంగా
డిగ్రీ పరీక్షలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని పలు పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వీసీ శ్రీనివాస్ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, వాసవీ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థి వెళ్లే క్రమంలో తప్పకుండా హాల్‌టికెట్‌తో పాటు ఒక గుర్తింపు కార్డును పరిశీలించిన అనంతరం కేంద్రంలోనికి అనుమతించాలని ఆదేశించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని సూచించారు. సెమిస్టర్–4కు సంబంధించి మొత్తం 8,142 మంది విద్యార్థులకు 7,859 మంది విద్యార్థులు హాజరై 283 గైర్హాజరయ్యారు. సెమిస్టర్–5కు సంబంధించి 467 మంది విద్యార్థులు 435 మంది హాజరై 32 మంది గైర్హాజరైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు.

జాతీయ రక్షణ నిధికి రూ.లక్ష విరాళం