
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వద్దు
గద్వాల: రైస్‌మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన గద్వాల మండలం కొత్తపల్లి, రేకులపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈసందర్భంగా కేంద్రాలలోని ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్ధేశిత మిల్లులకు తరలించడంతో పాటు తక్షణమే మిల్లుల వద్ద అన్‌లోడింగ్ జరిగేలా పర్యావేక్షణ జరపాలన్నారు. అక్కడే రైతులను పలుకరించి ధాన్యం అమ్మకాలలో ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాలలో సేకరించిన ధాన్యం నిల్వల గురించి, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందున ధాన్యం తరలింపు, రైస్‌మిల్లల వద్ద అన్‌లోడింగ్ ప్రక్రియ త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గన్నీబ్యాగుల కొరత, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. అకాలవర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోకుండా సరిపడా సంఖ్యలో టార్పాలిన్లు సమకూర్చుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ మల్లిఖార్జున్, డీటీ అజిత్‌కుమార్, ఆర్‌ఐ రామకృష్ణ, ఏఈవో హరీష్, డీపీఎం రామ్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.