
భూ భారతి సదస్సులను వినియోగించుకోండి
ఇటిక్యాల: రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఇటిక్యాల మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి సదస్సులో ఆయన పాల్గొని రైతుల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, జిల్లాలో ఇటిక్యాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసం గతంలో ప్రజలు అధికారులను కలవాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు అధికారులే గ్రామాల్లోకి వచ్చి నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి నెలాఖరులోగా అర్హులైన వారికి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. రైతులు నిర్దేశిత ప్రొఫార్మా ద్వారా దరఖాస్తులను ఇవ్వాలని సూచించారు. ఈ సదస్సులో భూ రికార్డుల సవరణలు, విస్తీర్ణ మార్పులు, వారసత్వ సమస్యలు, భూమి స్వభావానికి సంబంధించిన లోపాలు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, సాదాబైనామాలు, సర్వే నెంబర్ గల్లంతు, పట్టాదారు పాస్‌బుక్‌జారీ కాకపోవడం వంటి అంశాలు పరిష్కరించబడతాయని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఉచితమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సులో తహసీల్దార్లు వీరభద్రప్ప, నరేష్, డి టి నందిని, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.