
భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
ఇటిక్యాల: భూ సమస్యలను పరిస్కరించేందుకు గాను ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి.ఎం సంతోష్ అన్నారు. సొమవారం మండలంలోని గోపల్‌దిన్నెలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టుగా మండలాన్ని ఎంపిక చేశారని, భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు సమర్పించాలని, అధికారులు స్వయంగా గ్రామాలకే దరఖాస్తులను పరిశీలించి, అర్హతను నిర్ధారించిన తర్వాత వారికి సంబంధింత ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు. మీసేవ కేంద్రాలలో దరఖాస్తు ఫీజు ఉంటుందని, ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తులను పూర్తిగా ఉచితంగా స్వీకరించబడుతాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
అనంతరం కలెక్టర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్దిదారులు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పనులు సకాలంలో పూర్తి అయ్యేందుకు పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలో మొత్తం 55 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికే 8 ఇళ్లకు బేస్‌మెంట్ పూర్తికాగా ముగ్గురికి మొదటి విడతగా రూ.1లక్ష వచ్చినట్లు తెలిపారు. ఇళ్ల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ.. లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం వెంటనే అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ, హౌసింగ్ పీడీ శ్రీనివాసులు, తహశీల్దార్‌లు వీర భద్రప్ప, నరేష్, ఎంపీడీఓ అజార్ మొహినుద్దీన్, ఎఓ రవికుమార్ పాల్గొన్నారు.